‘పలాస 1978’ దర్శకుడికి అడ్వాన్స్‌ ఇచ్చిన అల్లు అరవింద్‌

టాలీవుడ్‌లో కొత్త దర్శకుడు కరుణ కుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం ‘పలాస 1978’. ఈ గ్రామీణ ప్రేమకథా చిత్రంలో రక్షిత్‌, నక్షత్ర ప్రధాన పాత్రల్లో నటించగా రఘు కుంచె విలన్‌గా కనిపించనున్నారు. మార్చి 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ‘పలాస 1978’ వీక్షించిన అల్లు అరవింద్‌.. చిత్ర దర్శకుడు కరుణ కుమార్‌ను ప్రశంసించారు.

‘పలాస 1978’ చిత్రం తనకు ఎంతగానో నచ్చడంతో దర్శకుడు కరుణ కుమార్‌తో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో అల్లు అరవింద్‌.. అడ్వాన్స్‌ చెక్‌ను కరుణ కుమార్‌కు అందించారు. ఈ మేరకు కరుణ కుమార్‌ గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను పలువురు సినీవిశ్లేషకులు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.