26 న మావోయిస్టుల భారత్ బంద్

లేఖ విడుదల చేసినమావోయిస్టు అధికార ప్రతినిధి జగన్

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మార్చి 26 న భారత్ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.దేశంలోని యావత్తు ప్రజలు పోరాడే రైతాంగానికి మద్దతునివ్వాలని ఆపార్టీ అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాకు లేఖ విడుదల చేసారు.సామ్రాజ్యవాదుల ప్రయోజిత ఆదేశాలతో మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు రైతాంగం పోరాటాన్ని కొనసాగించాలన్నారు.

పోరాట వారసత్వం గల రైతాంగం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ప్రతిఘాతుక మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మిలిటెంట్ గా పోరాడుతున్నదని, భూమి, స్వపరిపాలన కోసం బ్రిటీష్ వలస వాదులకు వ్యతిరేకంగా పోరాడిన రైతాంగం, నేడు నయావలసవాదుల, సామ్రాజ్యవాద అనుకూల, దళారి నిరంకుశ బడాబూర్జువా ప్రయోజనాలు నెరవేర్చడానికి బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని జగన్ లేఖలో పేర్కొన్నారు. మూడు చట్టాల ద్వారా ప్రభుత్వం తమ భూములను లాక్కుంటుందని, గ్రహించిన రైతాంగం ఎంతో పట్టుదలతో పోరాటానికి దిగిందని,వంద రోజులకు పైగా సాగుతున్న రైతాంగపోరాటాలు తమకు ఎదురులేదని భావిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నాయన్నారు..సామ్రాజ్యవాదులకు, దళారి నిరంకుశ బూర్జువా వర్గానికి కలవరం రేపుతున్నదన్నారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత హిందూ రాష్ట్రం ఏర్పాటుకు, సామ్రాజ్యవాదుల, దళారి నిరంకుశ బూర్జువా ప్రయోజిత కార్యక్రమాలను దూకుడుగా అమలు చేస్తున్నాడని. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు, నిర్ణయాలు, నిర్బందాలకు బలి అవుతున్న రైతాంగం, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, జాతులు, మైనారిటీలు, మేధావులు, పాత్రికేయులు, ప్రజాస్వామికవాదులు ఒక్కటై మిలిటెంట్ గా పోరాడి మోడీ ప్రభుత్వానికి, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి ఘోరీ కట్టాలని జగన్ పిలుపునిచ్చారు. నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయడం ద్వారానే భారత ప్రజలు అన్ని రకాల దోపిడీ నుండి విముక్తి అవుతారని జగన్ అన్నారు.