వుమెన్స్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఫైన‌ల్లో ఆస్ట్రేలియా వ‌ర్సెస్ భార‌త్‌

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో భార‌త్‌తో.. ఆస్ట్రేలియా త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఇవాళ సిడ్నీలో జ‌రిగిన రెండ‌వ సెమీస్‌లో.. సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఉత్కంఠ విజ‌యాన్ని న‌మోదు చేసింది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో ఆస్ట్రేలియా 5 ప‌రుగుల తేడాతో విక్ట‌రీ సొంతం చేసుకున్న‌ది.  తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. ఆతిథ్య జ‌ట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 134 ర‌న్స్ చేసింది.  ఆసీస్ జ‌ట్టులో మెగ్ లానింగ్ అత్య‌ధికంగా 49 ర‌న్స్ చేసింది. బెత్ మూనీ 28, అలెసా హీలీ 18 ర‌న్స్ చేశారు.

సౌతాఫ్రికా బౌల‌ర్ నాద్నీ డీకిర్క్ మూడు వికెట్లు తీసుకున్న‌ది. అయితే వ‌ర్షం కార‌ణంగా.. సౌతాఫ్రికా టార్గెట్‌ను స‌వ‌రించారు. 13 ఓవ‌ర్ల‌లో 98 ర‌న్స్ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికా.. నిర్దేశిత ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి కేవ‌లం 92 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. ఇవాళ ఇంగ్లండ్‌తో జ‌ర‌గాల్సిన తొలి సెమీస్ వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దు కావ‌డంతో.. భార‌త్ ఫైన‌ల్లో ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. మార్చి 8వ తేదీన మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో భార‌త్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.