మ్యాచ్ ర‌ద్దు.. ఫైన‌ల్ చేరిన టీమిండియా

హ‌ర్మ‌న్ ప్రీత్ అండ్ గ్యాంగ్ క‌ల‌ని ఎట్ట‌కేల‌కి వ‌రుణుడు నెర‌వేర్చాడు. మహిళల పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగుసార్లు సెమీఫైనల్‌ చేరిన టీమ్‌ఇండియా ఒక్కసారి కూడా ఆ అడ్డంకిని దాటి ఫైన‌ల్ చేర‌లేకపోయింది. కాని ఈ రోజు మ్యాచ్ ఆడ‌కుండానే వ‌రుణుడి ద‌య‌తో డైరెక్ట్‌గా ఫైన‌ల్ చేరింది. సిడ్నీలో వ‌ర్షం నిరంత‌రంగా కురుస్తుండ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ని క్యాన్సిల్ చేస్తూ తొలి సెమీస్ విజేత‌గా భార‌త్ అని ప్ర‌కటించారు. గత టోర్నీ సెమీస్‌లో ఇండియాని ఇంటిబాట ప‌ట్టించిన ఇంగ్లండ్‌కి ఈ సారి నిరాశే ఎదురైంది.

గ్రూపు లీగులో అన్ని మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్ల‌తో భార‌త్ టాప్‌లో ఉండ‌గా, ఇంగ్లండ్ చేతిలో ఆరు పాయింట్లు మాత్ర‌మే ఉన్నాయి. దీంతో భార‌త్ నేరుగా ఫైన‌ల్‌కి చేరింది. మ‌రికొద్ది గంట‌లో జ‌ర‌గ‌నున్న రెండో సెమీస్‌కి కూడా వ‌రుణుడు అడ్డుప‌డనున్న‌ట్టు తెలుస్తుంది. దీంతో ద‌క్షిణాఫ్రికా (7), ఆస్ట్రేలియా(6)ల‌లో సౌతాఫ్రికాకే ఎక్కువ పాయింట్స్ ఉన్న క్ర‌మంలో సౌతాఫ్రికా నేరుగా ఫైన‌ల్స్‌కి చేరుతుంది. ఈ క్ర‌మంలో మార్చి 8న జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్‌లో భార‌త్‌, సౌతాఫ్రికాలు త‌ల‌ప‌డ‌నున్నాయి.