రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన నీటి తగాదాలను అనుకూలంగా మల్చుచకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా? తెలుగు రాష్ట్రాల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు నీటి వివాదాలను అస్త్రాలుగా వాడుకోవాలన్నది కమలనాధుల ఆలోచనా? హడావుడిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం వెనుక మతలబు ఏమైనా ఉందా? తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జలవివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ ఉంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దీనికి ఛైర్మన్. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులు. రాయలసీయ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ఆరోపణలు తీవ్రమవుతున్న క్రమంలో ఈ నెల 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సమాచారం పంపించింది. దీన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యతిరేకించారు. ఆగస్టు 20 తర్వాత అయితే తమకు అభ్యంతరం లేదని ఆయన తెలపడంతో ఇప్పుడు రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండానే ఈ నెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని భావించింది. అయితే కేంద్ర జలశక్తి మంత్రికి కరోనా పాజిటివ్ సోకడంతో ఆసుపత్రిలో చేరడంతో ఈ సమావేశం వాయిదా పడింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు ప్రస్తావన ఉంది. 2016 సెప్టెంబర్‌లో అపెక్స్ కౌన్సిల్ అప్పటి జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది. దానికి అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల కృష్ణా నది ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మల్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గతంలో రెండు పార్టీల మధ్య ఈ స్థాయి వ్యతిరేకత కనిపించలేదు. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు స్థానాల్లో విజయం సాధించడంతో టీఆర్ఎస్పై బీజేపీ వైఖరిలో మార్పు చోటుచేసుకుంది. విచిత్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ చతికిలబడి ఉన్నాయి.
తాజా పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో మాట్లాడినట్టు సమాచారం. అంతే కాదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కొత్తది కాదంటూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాలపై పునఃపరిశీలన చేపట్టినట్టు తెలుస్తోంది. వీలైతే ఆ ఆదేశాలు వెనక్కి తీసుకునేలా చర్యలు చేపట్టే అవకాశం లేకపోలేదని సమాచారం. ఈ విషయంలో బీజేపీ చాలా పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తోంది.
సాగునీటి రంగానికి తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యత
కొత్తగా ఏర్పడిన తెలంగాణ, వేరు పడిన ఆంధ్రప్రదేశ్ రెండూ కూడా సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గోదావరి నదిపై కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి అనతి కాలంలోనే దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే సమయంలో పాలమూరు-రంగారెడ్డి, డిండి, ఉదయసముద్రం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల నిర్మాణం తుది దశకు చేరింది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయినా కృష్ణా నీటికి లభ్యతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావు. నీటికి సద్వియోగం చేసుకోలేకపోవడంతో ఏటా వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. గతేడాది దాదాపు 600 టీఎంసీ కృష్ణా జలాలు బంగాళాఖాతంలో కలిశాయి. ఒకవేళ భవిష్యత్‌లో కృష్ణాలో నీటి లభ్యత మందగించినా గోదావరి జలాలతో ఆ సమస్యను అధిగమించేందుకు మార్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణమవుతున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరం, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం జరిగితే నాగార్జునసాగర్‌పై ఆంధ్రప్రదేశ్ ఆధారపడటం తగ్గిపోతుంది. శ్రీశైలం నుంచి ఎక్కువ జలాలను ఉపయోగించుకునేలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలి. శ్రీశైలం జలాశయాన్ని విద్యుత్ ఉత్పత్తికి బదులు సాగు, తాగు నీటి అవసరాల కోసం పూర్తిగా వినియోగించుకోవచ్చు.
యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో పండే పంటలకు వర్షమే ఆధారం. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలోనూ అదే పరిస్థితి. ఈ ప్రాంతాల్లో నీటి లభ్యతను పెంచాల్సిన అవసరం చాలా ఉంది. సాగు, తాగు నీటి సదుపాయాలు ఇక్కడ మెరుగుపరిచేందుకు ఈ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కృష్ణా ప్రాజెక్టులపై శీతకన్ను
గోదావరిపై కాళేశ్వరాన్ని మూడేళ్ల అతి తక్కువ సమయంలో నిర్మించి చరిత్ర సృష్టించిన తెలంగాణ సీఎం కేసీఆర్ – కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతే కాదు దక్షిణ తెలంగాణను కేసీఆర్ అసలు పట్టించుకోవడం లేదని విపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి. దక్షిణ తెలంగాణను అభివృద్ధిబాటలో నడపాలంటే కృష్ణా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ ఈ ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
పోతిరెడ్డిపాడు ఎత్తు వివాదం
శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు 114 టీఎంసీల నీటిని అందించాల్సి ఉంది. గత రెండు సంవత్సరాలు మినహాయిస్తే ఏ సంవత్సరం కూడా సగం నీటిని కూడా సీమ ప్రాజెక్టులకు మళ్లించలేకపోయారు. 2004-05 మొదలు 2019-20 వరకు నీటి వినియోగాన్ని పరిశీలిస్తే ఆ విషయం స్పష్టవమతోంది. రాయలసీమకు తెలుగుగంగ (29 టిఎంసీలు), ఎస్.ఆర్.బి.సి (19), గాలేరు-నగరి-జిఎన్ఎస్ఎస్ (39), చెన్నైకి తాగు నీరు (15), టిబిపి హెచ్ఎల్సి (10), తాగునీటి అవసరాలు- ఆవిరి నష్టాలు (3 టిఎంసీలు) కలిపి మొత్తం 114 టిఎంసీల నీటి కేటాయింపు ఉంది. 2004-05లో మొత్తం 56.51 టిఎంసిలు వినియోగించారు. 2005-06లో 78.49, 2007-08లో 48.05, 2009-10లో 60.14 టిఎంసిలు (ఈ సంవత్సరం కృష్ణాకు గరిష్ఠ స్థాయిలో వరద వచ్చింది) మాత్రమే వినియోగించారు. 2012-13లో అతి తక్కువగా 22.49 టిఎంసిలు, 2014-15లో 59.17 నీటిని ఉపయోగించారు. 2015-16లో అత్యల్పంగా కేవలం 0.95 అంటే ఒక టిఎంసి నీటిని కూడా విడుదల చేయలేదు. ఆ తర్వాత వరుసగా నాలుగేళ్ళు గత ఏడాది వరకు 67.44, 91.70,115.40, 179.30 టిఎంసిల చొప్పున లభించాయి.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పాత ప్రాజెక్టే
ఈ పరిస్థితుల్లో నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని వృధాను అరికట్టేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపి ప్రభుత్వం చేపట్టింది. ఇది కొత్త పథకం కాదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన నిపుణుల కమిటి తేల్చిచెప్పింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు లేనేలేదు. పాత ఆయకట్టుకు కేటాయించిన నీరు ఎస్ఆర్ఎంసిలోకి వెళ్లేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకోసం సంగమేశ్వర దగ్గర పంపింగ్ కేంద్రాన్ని నిర్మించి నీటిని ఎస్ఆర్ఎంసిలోకి పోతిరెడ్డిపాడు సమీపంలో విడుదల చేస్తారు. అందువల్ల ఈ ప్రాజెక్ట్‌ను కొత్త ప్రాజెక్ట్‌గా పరిగణించాల్సిన అవసరం లేదు. కేటాయించిన నీటిని ఉపయోగించుకునేందుకు ఇది సహాయకారిగా ఉంటుంది.
రాయలసీమపై రాజకీయ రచ్చ ఎందుకు?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు పెదవి విప్పడం లేదు. నోరు తెరిస్తే ఎక్కడ తమను నిందిస్తారనే భయంతో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ వ్యవహరిస్తున్నాయి. అనుకూలంగా మాట్లాడితే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి వస్తుందనే భయంతో మౌనముద్రదాల్చాయి. పచ్చ మీడియా కూడా అదే రీతిలో వ్యవహరిస్తోంది. కాబట్టి దీనిపై ఏపీలో ఎటువంటి చర్చ జరగడం లేదు. ఈ పరిస్థితిని అనుకూలంగా మల్చుకోవాల్సిన ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచడంలో వైఎప్సీఆర్సీపీ విఫలమైనట్టు కనిపిస్తోంది. ఇంత వివాదం జరుగుతున్నా దీనిపై అటు జలవనరుల శాఖ మంత్రిగాని, సీఎంగాని, అధికార పార్టీ నేతలుగాని స్పందించడం లేదు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అత్యున్నత కమిటీ చెప్పిన విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో ఎక్కడో లోపం కనిపిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందనే భావన దక్షిణ తెలంగాణలో బలంగా పాతుకుపోతోంది.
వివాదం తెలంగాణలోనే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కుమ్మక్కు అవడం వల్లే సీఎం కేసీఆర్ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మాట్లాడటం లేదని కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రాజకీయంగా అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హైకోర్టులో కేసు కూడా వేసింది. అటు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వీటిపై విచారణ జరగాల్సి ఉంది. ఇదే సమయంలో జాతీయ హరిత ట్రైబ్యూనల్ నుంచి సానుకూల ఆదేశాలు రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది.
మరో వైపు తెలంగాణలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు తగ్గట్టుగా కేంద్రం వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ నాయకుల నుంచి విమర్శలు వచ్చినప్పుడుల్లా ఢిల్లీ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఏదో రూపంలో నోటీసులు వస్తున్నాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ బీజేపీ నేతల ఫిర్యాదులపై కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ దూకుడుగానే స్పందిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే తెలంగాణలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులను సమగ్ర ప్రాజెక్టు నివేదికలు ఇచ్చేంత వరకు ఆపేయాలనే ఆదేశాలు కేంద్ర నుంచి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే మాటలు ఇంజినీరింగ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇలా అవకాశాన్ని రాజకీయంగా అందిపుచ్చుకొని తెలంగాణలో బలపడాలన్నది కమలనాధుల ఆలోచనగా కనిపిస్తోందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ కంటే బలంగా ఎదగాలంటే అధికార టీఆర్ఎస్ను అడుగడుగునా ఇరకాటంలో పెట్టాలన్నది కమలనాధుల వ్యూహం కావచ్చు.
ఏది ఏమైనా నీటి ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలకు ఆతీతంగా వ్యవహరించకపోతే కృష్ణా జలాలు సముద్రంలోకి వృధాగా పోవడం కొనసాగుతూనే ఉంటుంది. అటు రాయలసీమ, దక్షిణ తెలంగాణ ఎప్పుడూ కరువు బారిన పడుతూనే ఉంటాయి.