“మేడిగడ్డ రిపేర్ చేసే తెలివి లేకపోతే.. వారం రోజులు కేసీఆర్‌కు అప్పగించు “

కాళేశ్వరం, మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన కేటీఆర్ – “రాష్ట్రానికి నీళ్లు అందించే బాధ్యత మాది”


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

“మేడిగడ్డ రిపేర్ చేసే తెలివి లేకపోతే ఒక్క వారం రోజులు కేసీఆర్ గారికి అప్పగించండి. మొత్తం తెలంగాణకు నీళ్లు పారేలా చేసే బాధ్యత మాది” అని సవాల్ విసిరారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎంతటి సూపర్ ఎల్‌నినో పరిస్థితులు వచ్చినా మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉంటుందని ఇంజనీర్లు, సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) సూచించిన తర్వాతే అక్కడ బ్యారేజ్ నిర్మించామని తెలిపారు.

మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించామని, తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో డ్యామ్ నిర్మించేందుకు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను కేసీఆర్ కోరినా, ముంపు కారణంగా వారు అంగీకరించలేదని చెప్పారు. దీంతో 148 మీటర్ల ఎత్తుకు పరస్పర అంగీకారంతో ఒప్పందం కుదిరిందని వివరించారు.

పోలవరం ప్రాజెక్టు దశాబ్దాలుగా పూర్తి కాలేదని, కానీ కేసీఆర్ నాయకత్వంలో కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేశామని కేటీఆర్ పేర్కొన్నారు.

కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారానే వర్షపాతం లేకున్నా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని, ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. కేవలం కన్నెపల్లి పంప్ హౌస్ గేట్లు ఎత్తితే రాష్ట్రవ్యాప్తంగా నీటి సరఫరా సాధ్యమవుతుందని అన్నారు.

మేడిగడ్డ బ్యారేజిలో మొత్తం 370 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని, ఎన్నికల ముందు కేసీఆర్ పేరును దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ ఘటన జరిగి ఉండొచ్చనే అనుమానం తమకు ఇప్పటికీ ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఆ రెండు పిల్లర్ల బ్లాక్‌ను తిరిగి నిర్మించడానికి సుమారు రూ.400 కోట్లు మాత్రమే అవసరమని, ఆ ఖర్చును కూడా ఎల్‌అండ్‌టీ సంస్థ భరిస్తామని ముందుకు వచ్చినప్పటికీ, గత 31 నెలలుగా రిపేర్ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు.

మీడియా తో మాట్లాడుతున్న కేటీఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here