మహబూబాబాద్ జిల్లాలో డీఫాల్టర్ రైస్ మిల్లర్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయల బకాయిలు ఉన్న కేసముద్రం ప్రాంతానికి చెందిన మారుతీ, మహాదేవ రైస్ మిల్లుల విషయంలో అధికారుల వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదు అయినప్పటికీ, సంబంధిత మిల్లర్ల ఆస్తుల జప్తు ప్రక్రియ ముందుకు సాగకపోవడం, అదే సమయంలో మిల్లులను లీజుకు ఇచ్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఫాల్టర్ మిల్లర్లకు పరోక్షంగా సహకరిస్తూ, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రమేష్ నాయక్‌పై వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, మిల్లు గోదాంను మాత్రమే అదనపు ధాన్యం నిల్వలకు వినియోగించుకోవచ్చని, డీఫాల్టర్ మిల్లుల్లో ధాన్యం నిల్వ చేసినా లేదా మిల్లులను లీజుకు ఇచ్చినా చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ స్పష్టం చేసిన నేపథ్యంలో, ఈ వ్యవహారంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? డీఫాల్టర్ మిల్లర్లకు ఎవరి అండ ఉంది..?
ప్రభుత్వానికి కోట్ల రూపాయల మేర బకాయిలు ఎగవేసి డీఫాల్టర్లుగా నిలిచిన రైస్ మిల్లర్లపై చట్టపరమైన చర్యలు వేగవంతం కావాల్సిన సమయంలో, కొందరు అధికారులు వారి ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కేసముద్రం మండలానికి చెందిన మారుతీ, మహాదేవ రైస్ మిల్లుల వ్యవహారంలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ధాన్యం మిల్లింగ్ చేసి బియ్యం అప్పగించాల్సిన బాధ్యతను విస్మరించి, కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి నష్టం కలిగించిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ కింద కేసులు నమోదైనప్పటికీ, తదుపరి చర్యలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి . చట్టం ప్రకారం బకాయిలు చెల్లించని వారి ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వ బకాయిలను రికవరీ చేయాల్సి ఉండగా, ఆ దిశగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.
ఇదిలా ఉండగా, డీఫాల్టర్ మిల్లులు నేరుగా కార్యకలాపాలు నిర్వహించకుండా, లీజుల రూపంలో పరోక్షంగా వ్యాపారం కొనసాగిస్తున్నాయనేది వాస్తవం . మిల్లుల పేరును మార్చినా, లీజుదారులను మార్చినా, అసలు లబ్ధిదారులు మాత్రం అదే డీఫాల్టర్ మిల్లర్లేనన్న అభిప్రాయం జిల్లాలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో సంబంధిత శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కొందరు అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అదనపు కలెక్టర్ వ్యాఖ్యలతో బయటపడిన వాస్తవం…
ఈ వ్యవహారంపై స్పందించిన అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, మిల్లు ప్రాంగణంలోని గోదాములను మాత్రమే అదనపు ధాన్యం నిల్వ కోసం వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, డీఫాల్టర్‌గా ఉన్న మిల్లులో ధాన్యం మరపట్టినా, మిల్లును లీజుకు ఇచ్చినా సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని ఆయన న్యూస్ 10 ప్రతినిధి తో పేర్కొన్నారు
అయితే జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తే, ఈ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డీఫాల్టర్ మిల్లులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటిపై కఠిన చర్యలు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
డీఎస్ఓ పాత్రపై ప్రశ్నలు…
జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్ఓ) రమేష్ నాయక్ వ్యవహారశైలిపై కూడా పలు విమర్శలు వినిపిస్తున్నాయి. డీఫాల్టర్ మిల్లర్ల విషయంలో కఠిన చర్యలకు బదులుగా వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, మిల్లర్ల పక్షాన నిలుస్తూ ఉన్నతాధికారులకు సైతం వాస్తవ పరిస్థితులను పూర్తిగా తెలియనీయకుండా మిస్ గైడ్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
డీఫాల్టర్ మిల్లులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, అదే మిల్లుల కార్యకలాపాలు కొనసాగేందుకు అవకాశాలు కల్పిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. గోదాముల వినియోగం, లీజుల వ్యవహారం, ధాన్యం నిల్వల అంశాల్లో అధికారులు చూపుతున్న సడలింపులు ఎవరి ప్రయోజనాల కోసం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జప్తు చర్యలు ఎందుకు నిలిచిపోయాయి..?
రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదైన తర్వాత సాధారణంగా ఆస్తుల జప్తు, బ్యాంకు ఖాతాల పరిశీలన, బకాయిల రికవరీ వంటి చర్యలు చేపట్టాలి. అయితే కోట్ల రూపాయల ప్రభుత్వ బకాయిలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, సంబంధిత మిల్లర్ల ఆస్తుల జప్తు ప్రక్రియ ముందుకు సాగకపోవడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
చట్టపరమైన చర్యలు ఆలస్యం కావడంతో డీఫాల్టర్ మిల్లర్లు ఎలాంటి భయం లేకుండా తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నిలిచిపోవడమే కాకుండా, నిజాయితీగా వ్యవహరించే మిల్లర్లకు కూడా అన్యాయం జరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సమగ్ర విచారణకు డిమాండ్
డీఫాల్టర్ మిల్లుల వ్యవహారంలో గోదాముల వినియోగం, లీజుల పేరుతో కొనసాగుతున్న కార్యకలాపాలు, రెవెన్యూ రికవరీ చర్యల్లో జాప్యం, అధికారుల పాత్ర వంటి అంశాలపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ జరపాలని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వానికి నష్టం కలిగించిన వారిపై మాత్రమే కాకుండా, వారికి సహకరించిన అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
ప్రభుత్వ ధాన్యం, ప్రజాధనం, రైతుల ప్రయోజనాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయా? లేక గోదాముల పేరుతో సాగుతున్న లీజుల దందా మరింత కాలం కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.



