అరకొర అనుమతులు అడ్డగోలుగా ఫీజులు..
ప్లే గ్రౌండ్ లేదు ఫైర్ సేఫ్టీ కానరాదు..
జీ ప్లస్ త్రీ లో స్కూల్ నిర్వహణ నిబంధనల ఉల్లంఘన
ఫిర్యాదులు అందినా పట్టింపులేని మండల విద్యా శాఖ అధికారులు.
నయిమ్ నగర్ కేంద్రంగా పోచమ్మ కుంటలో జోరుగా విద్యా వ్యాపారం..
హనుమకొండ నగరంలోని నయిమ్ నగర్ కేంద్రంగా, పోచమ్మకుంట ప్రాంతంలో నిర్వహిస్తున్న లిటిల్ మేధా విద్యాసంస్థ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, భద్రతా నిబంధనల విషయంలో తీవ్ర లోపాలు ఉన్నప్పటికీ భారీ ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాల నిర్వహణకు అవసరమైన పూర్తి స్థాయి అనుమతులు లేకుండానే విద్యాసంస్థ కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రుల నుంచి మాత్రం లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. విద్యా ప్రమాణాల కంటే ఆదాయంపైనే యాజమాన్యం దృష్టి పెట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, పాఠశాలకు సరైన ప్లేగ్రౌండ్ సౌకర్యం లేకపోవడం. చిన్నారుల శారీరక వికాసానికి అవసరమైన ఆట స్థలం లేకుండానే విద్యాసంస్థ నడుస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆరోపిస్తున్నారు.అలాగే అగ్నిప్రమాదాల నివారణకు తప్పనిసరిగా ఉండాల్సిన ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు కూడా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో భద్రతా నిబంధనల అమలు అత్యంత కీలకంగా మారినప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం ఈ అంశంపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.జీ ప్లస్ త్రీ (G+3) భవనంలో పాఠశాల నిర్వహణ జరుగుతున్నప్పటికీ, ఆ భవనం విద్యాసంస్థ నిర్వహణకు అనుకూలమా? సంబంధిత అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తరగతి గదులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఈ వ్యవహారంపై పలుమార్లు ఫిర్యాదులు అందినా మండల విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తనిఖీలు నిర్వహించకుండా, ఫిర్యాదులను పక్కనబెడుతూ యాజమాన్యానికి పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చి భారీ ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లిటిల్ మేధా స్కూల్ అనుమతులు, భద్రతా ప్రమాణాలు, ఫీజుల నిర్మాణంపై సమగ్ర విచారణ జరిపించాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.



