బియ్యం దొంగలు…?.

వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో యథేచ్ఛగా ప్రజాపంపిణీ బియ్యం అక్రమ రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు కొందరు బియ్యం దొంగలు… తరుచుగా టాస్క్ పోర్స్ దాడులు జరిగిన ఎలాంటి భయం లేకుండా ఈ బియ్యం దందా కొనసాగుతూనే ఉంది.

పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు దళారులు… ప్రతి నెల ప్రజా పంపిణి కి అందవలసిన బియ్యం దళారులు పాలిష్ చేసి మళ్ళీ ప్రభుత్వానికే విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం…. వరంగల్ నగర శివారులో సంగం, పర్వతగిరి మండలాల్లో పదుల సంఖ్యలో ఉన్న బియ్యం మిల్లుల్లో ఈ తతంగం అంత నడుస్తున్నట్లు సమాచారం. ప్రతి నెల 1 వ తారీకు నుండి పది రోజుల వరకు రేషన్ దుకాణాల్లో ప్రజలకు ప్రభుత్వం బియ్యం అందిస్తోంది. వీటిని దళారులు రేషన్ డీలర్ల తో చేతులు కలిపి సేకరించగా… కొంత బియ్యాన్ని వాడ వాడ తిరుగుతూ ప్రజల దగ్గర నుండి సేకరించి ఈ బియ్యాన్ని ఆటోల్లో మిల్లులకు తరలించి వాటిని మళ్ళీ రీసైకిల్ తో పాలిష్ చేసి అదే బియ్యాన్ని ప్రభుత్వానికి విక్రయిస్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డట్లు తెలిసింది.

బియ్యం దొంగలు...?.- news10.app

మిల్లు యజమానులు వరంగల్ నగరం లో సేకరించిన బియ్యాన్ని గవిచర్ల క్రాస్, మామూనూరు, పంథిని మీదుగా సంగం, పర్వతగిరి మండలాల్లో ఉన్న మిల్లులకు తరలిస్తున్నారు. అధికారులు అడపాదడపా మిల్లులపై దాడులు చేసినప్పటికీ చిన్నాచితక వారిపై కేసులు నమోదు చేసి అసలు దొంగలను వదిలి పెడుతున్నట్టు సమాచారం… రెండు మండలాల పరిధిలో దాదాపు పది నుండి పదిహేను మిల్లులు ఉండగా వ్యాపారం మొత్తం అక్కడి నుండే నడుస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. నగరంలో పలు ప్రాంతాల నుండి ప్యాసింజర్ ఆటోలు, గూడ్స్ ఆటోల్లో తరలించిన బియ్యాన్ని సంబంధిత మిల్లులల్లో నిల్వచేసి వాటిని పాలిష్ చేసి మార్చి అదే బియ్యాన్ని మళ్లీ ప్రభుత్వానికి విక్రయిస్తున్నట్లు తెలిసింది.

ఈ తతంగం అంతా అధికారుల కను సన్నల్లో నడుస్తున్నట్టు సమాచారం. వ్యాపారం బాహాటంగా నడుస్తుందని సంబంధిత పోలీస్ స్టేషన్లో అధికారులకు తెలిసినప్పటికీ కనీసం అటువైపు కన్నెత్తి అయినా చూడకపోవడం విడ్డూరం అనిపిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ బియ్యం అక్రమ దందా అటు వ్యాపారస్తులు మరోవైపు దళారులు ఎలాంటి భయం లేకుండా మూడు పువ్వులు ఆరు కాయలుగా వారి అక్రమాదందా విరాజిల్లుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పేదలకు అందించే బియ్యాన్ని దళారుల చేతుల్లో పడకుండా అధికారులు చర్యలు తీసుకొని వ్యాపారానికి అడ్డుకట్ట వేస్తారని ఆశిద్దాం.