బదిలీ చేసిన… కదిలేది లేదంటున్నారు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బదిలీల విషయంలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంది… బదిలీల విషయంలో ఎంత అసంతృప్తి ఉన్న కొందరు పోలీస్ అధికారుల్లో బదిలీ కాగానే విధుల్లో చేరిన కొంతమంది మాత్రం ఇప్పటికి విధుల్లో చేరకుండా తమ అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నట్లు తెలిసింది… బదిలీల విషయంలో కనీస నిబంధనలు పాటించకుండా బదిలీ చేస్తున్నారనే ఆరోపణలు ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల్లో చక్కర్లు కొడుతున్నాయట… ఉన్నట్టుండి ఒకేసారి జిల్లాలు మారుస్తూ… మరికొందరిని అసలు వరంగల్ జోన్ కు సంబంధం లేని ఇతర జోన్ లకు బదిలీ చేస్తున్నారని కొందరు పోలీస్ అధికారులు ఆవేదన చెందుతున్నారట… ఏ కారణం లేకుండా అకారణంగా జోన్ దాటి వేరే జోన్ కు బదిలీ చేస్తే అసలు ఎందుకు బదిలీ చేశారో తెలియకుండా ఎందుకు విధుల్లో చేరాలని కొందరు పోలీస్ అధికారులు ప్రశ్నిస్తున్నారట… నిభందనలకు విరుద్ధంగా బదిలీ చేసి అసలు ఎందుకు బదిలీ చేశారో చెప్పకుండా అధికారులు సమాధానం దాటవేస్తూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పోలీస్ అధికారుల్లో గుసగుసలు వినపడుతున్నాయి… ఈ విషయంలో పోలీస్ ఉన్నతాధికారులను ప్రశ్నించలేక ఎస్సై, సిఐ స్థాయి అధికారులు తమలో తామే మదనపడిపోతున్నారట…

బదిలీ చేసిన... కదిలేది లేదంటున్నారు- news10.app

ఎక్కడికిపోతాం… కదలం?

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఎస్సై, సిఐ లను ఇటీవల వివిధ ప్రాంతాలకు అధికారులు బదిలీ చేశారు. వీరిలో ఇప్పటివరకు 14మంది ఎస్సై లను సీఐడీ విభాగానికి వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు… బదిలీ ఐయినవారిలో ఇప్పటివరకు సగం మంది మాత్రమే బదిలీ చేసిన చోటికి వెళ్లి విధుల్లో చేరారు … మిగతా వారు ఏడుగురు ఎస్సై లు ఇప్పటివరకు విధుల్లో చేరలేదట… తమను అకారణంగా పని చేస్తున్న చోటునుంచి తొలగించి వేరే దూరపు ప్రాంతానికి బదిలీ చేశారని అంటున్నారట… ఇలా నిబంధనలకు విరుద్ధంగా అకారణంగా బదిలీ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్న వీరు వివిధ కారణాలను చూపుతూ ఇప్పటి వరకు విధుల్లో చేరలేదట… అకారణంగా అధికారుల ఇష్టం వచ్చిన చోటుకు బదిలీ చేస్తే ఎలా వెళ్తాం అంటున్న వీరు ఉన్నతాధికారుల కు తమ బాధను చెప్పుకోలేక ఓ మోస్తరు నిశ్శబ్ద యుద్దాన్ని చేస్తున్నారట… ఇక సిఐ ల విషయానికి వస్తే ఇప్పటివరకు దాదాపు 10 మంది సిఐ లు బదిలీ కాగా వారిలో ఒకే ఒకరు ఉమెన్ ట్రాకింగ్ సెల్ లో పని చేస్తుండగా… మిగతా 9 మంది సిఐ లు ఇప్పటి వరకు బదిలీ చేసిన చోటికి వెళ్లి విధుల్లో చేరలేదట… వీరు సైతం తమను అకారణంగా బదిలీ చేశారని, నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తున్నారట… వీరిలో ఓ సిఐ ని వరంగల్ జోన్ తో సంబంధం లేని ఆరవ జోన్ లోని నిజామాబాద్ కు బదిలీ చేయగా ఆ సిఐ ఇదేం బదిలీ… ఇవేం నిబంధనలు అంటూ బాధపడిపోతున్నాడట… ఇక కొందరు సిఐ లు ఉన్నతాధికారులను ప్రశ్నించలేక, బదిలీ విషయంలో తమ బాధను వెళ్లగక్కలేక ఆరోగ్య కారణాలతో సెలవు పెట్టి ఇంటిలోనే ఉండిపోతున్నారట… వీరు తమ బదిలీ పై అసంతృప్తిని ఇలా వ్యక్తపరుస్తున్నారన్నమాట.. ఇక ఇటీవల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ దాడి నేపథ్యంలో ఇద్దరు సిఐ లపై వేటు పడింది… వీరు సైతం తమపై అకారణంగా వేటు వేశారనే బాధలోనే ఉన్నారట…ఎమ్మెల్యే ఇంటిపై దాడికి కారణం ఎస్ బి విఫలం అంటూ తనపై వేటు వేసిన అధికారులు అసలు ఎస్ బి ఎలా విఫలం చెందిందో చెప్పకుండా తనపై బదిలీ వేటు వేశారని ఆవేదన చెందుతున్నాడట… అకారణంగా తనపై బదిలీ వేటు పడిందని ఈ సిఐ సైతం ఇప్పటివరకు విధుల్లో చేరనట్లు తెలిసింది… తాను ఎస్ బి లో ఎలా విఫలం చెందానో చెప్పకుండా విధుల్లో ఎలాచేరుతానని ఆ సిఐ అంటున్నారట… ఇక ఈ విషయం ఇలా ఉంటే వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వివిధ కారణాలతో సస్పెండ్ ఐయిన పోలీసు అధికారులపై సస్పెన్షన్ కాలం ముగిసిన ఇప్పటి వరకు రివోక్ కాకపోవడంపై పలు సందేహాలు కలుగుతున్నాయి… వీరిని ఇంకెప్పుడు విధుల్లో చేర్చుకుంటారో తెలియకుండా ఉందట… కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు జరిగిన బదిలీల్లో ఎందుకు ఇంత అయోమయ పరిస్థితి నెలకొందో అర్థం కాక పోలీస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారట.. బదిలీల విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వీరు త్వరలోనే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కలిసి బదిలీల విషయంలో తమ బాధను వ్యక్త పర్చనున్నట్లు సమాచారం. ఇందుకోసం సన్నద్ధమైన కొందరు అధికారులు త్వరలోనే పోలీస్ ఉన్నతాధికారిని కలువనున్నారని విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైన వరంగల్ కమిషనరేట్ లో కొందరు పోలీసు అధికారుల్లో అసంతృప్తికి కారణమైన బదిలీల విషయానికి పోలీస్ ఉన్నతాధికారులు ఎలా చెక్ పెడతారో వేచిచూడాలి.