తెలంగాణ రాజకీయాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన, “మళ్లీ చెబుతున్నా.. జరగబోయే కురుక్షేత్రంలో గెలిచేది మేమే” అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సీఎం, “కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని రాజకీయంగా పాతాళానికి తొక్కుతాం” అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి బలమైన పునాది అవుతాయని చెప్పారు.
ఎన్నికల షెడ్యూల్‌పైనా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “2028 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగవు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2029 జూన్‌లోనే ఎన్నికలు జరుగుతాయి” అని పేర్కొన్నారు.
అదేవిధంగా, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరుగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం 17గా ఉన్న లోక్‌సభ స్థానాలు 25కు, 119గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని అన్నారు. పెరిగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మరింత బలంగా నిలిచి ఘన విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి…



