కేటీఆర్ ఫైర్.. రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు
శ్యామ్ ప్రసాద్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు పంపాలనడం దారుణం
తెలంగాణ ఉద్యమకారుడిపై అవినీతి ముద్ర వేస్తారా..?
మా రక్తం కావాలంటే ఇస్తాం.. ముందు రైతులకు నీళ్లివ్వండి
తెలంగాణ ఉద్యమంలో పోరాడిన శ్యామ్ ప్రసాద్‌రెడ్డిని పట్టుకుని చర్లపల్లి జైలులో వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శ్యామ్ ప్రసాద్‌రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసి తాను ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.
‘‘నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే రిటైర్ అయ్యాను. అలాంటి నన్ను కాళేశ్వరం అవినీతిలో భాగస్వామినని రేవంత్‌రెడ్డి అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర హితం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతుంటే నాపై నిందలు మోపి చర్లపల్లి జైలుకు పంపాలని అంటున్నారు’’ అంటూ శ్యామ్ ప్రసాద్‌రెడ్డి తనతో బాధపడినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
మా రక్తం కావాలంటే రేపే ఇస్తాం.. రైతులకు నీళ్లివ్వు
‘‘మా రక్తమే కళ్ల చూస్తానంటే రేపే మేము ఇస్తాం.. కానీ రైతులకు నీళ్లు ఇవ్వాలి’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమ రక్తాన్ని తీసుకుని పంటలకు వేసి పండించాలని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు రక్తదానం చేశారని తెలిపారు. రక్తపు ప్యాకెట్లను తీసుకుని రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
కాళేశ్వరం సిస్టమ్‌లో అన్నీ నిక్షేపంగా ఉన్నాయి: కేటీఆర్
కాళేశ్వరం వ్యవస్థలో రిజర్వాయర్లు, బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, కాలువలు, మోటార్లు, సబ్‌స్టేషన్లు అన్నీ మంచిగానే ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘కాళేశ్వరం సిస్టమ్‌లో అన్నీ నిక్షేపంగా ఉన్నాయి.. ఒక్క రేవంత్‌రెడ్డి బుర్ర తప్ప’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రేవంత్‌రెడ్డి పంపులను ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇస్తే, ఆయన చేసిన దొంగతనాల గురించి కూడా తాము మాట్లాడబోమని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఒక్క మాట చెబితే తామే వెళ్లి పంపులను ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే సంయమనం పాటించాలని కేసీఆర్ సూచించినట్లు వెల్లడించారు.
రోజుకు 9 టీఎంసీలు కిందకు పోతున్నాయి
గోదావరి బేసిన్‌లోని కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, అన్నపూర్ణ, అన్నారం ప్రాజెక్టుల్లో ఎక్కడా 20 శాతానికి మించి నీటి నిల్వలు లేవని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
రోజుకు 9 టీఎంసీల నీరు కిందకు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎల్‌ఎండీ నీళ్ల కోసం ఎదురుచూస్తోందని, కరీంనగర్‌తో పాటు ఎల్‌ఎండీపై ఆధారపడిన తొమ్మిది నియోజకవర్గాలకు తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు.



