జూలై–సెప్టెంబర్‌లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: టీటీడీ

ఆణివార ఆస్థానం, పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కీలక నిర్ణయం

  • పేర్కొన్న తేదీల్లో వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబోమన్న టీటీడీ
  • యాత్రకు ముందే దర్శన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని భక్తులకు సూచన

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగే పలు వార్షిక ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో కొన్ని తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ మేరకు భక్తులు తమ యాత్రను ముందుగానే ప్రణాళికబద్ధంగా రూపొందించుకోవాలని సూచించింది.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 17న ఆణివార ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు. అలాగే జూలై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, జూలై 29న జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం సందర్భంగా కూడా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.

ఆగస్టు 22న పవిత్రోత్సవాల అంకురార్పణ, ఆగస్టు 24న పవిత్రోత్సవాల రెండో రోజు పవిత్రాల సమర్పణ సందర్భంగా కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేయనున్నారు.

అలాగే సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 14న బ్రహ్మోత్సవాల అంకురార్పణ, సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే వార్షిక శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.

ఈ తేదీల్లో కేవలం ముందురోజు ప్రోటోకాల్ కింద అర్హత కలిగిన ప్రముఖులకు మాత్రమే అనుమతి ఉంటుందని, వీఐపీ సిఫార్సు లేఖలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ తిరుమల యాత్రను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here