“రూ.15 కోట్ల సుపారీ”.. ప్రముఖ డాక్టర్‌కు బెదిరింపులు..!

ప్రముఖ వైద్యుడిని చంపేస్తామని రూ.15 కోట్ల సుపారీ పేరుతో బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్

మాజీ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరి కుట్రను ఛేదించిన హన్మకొండ పోలీసులు

  • రూ.15 కోట్ల సుపారీ వచ్చిందంటూ డబ్బులు డిమాండ్.. రెక్కీ చేస్తుండగా ములుగు క్రాస్ రోడ్డు వద్ద పట్టివేత

హన్మకొండకు చెందిన ప్రముఖ వైద్యుడిని హత్య చేస్తామని, తనపై రూ.15 కోట్ల సుపారీ వచ్చిందంటూ బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని కుట్ర పన్నిన ముగ్గురు నిందితులను హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా విశ్లేషణ, నిఘా ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన యమగోని సుభాష్ గౌడ్ (38) గతంలో హన్మకొండలోని రెనోవా ఆస్పత్రిలో ప్రముఖ వైద్యుడి వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న సుభాష్, వైద్యుడు ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం రచించాడు.

ఈ కుట్రలో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలానికి చెందిన శ్రీమూర్తి శ్రీనివాస్ (42), వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అజ్మీర్ నాయక్ తండాకు చెందిన బానోత్ రమేష్ (40)లను భాగస్వాములుగా చేసుకున్నాడు. సుభాష్‌కు డాక్టర్ కుటుంబ సభ్యులు, నివాసం, వాహనాలు, ప్రయాణాల వివరాలు తెలిసి ఉండగా, ప్రస్తుతం మరో వైద్యుడి వద్ద పనిచేస్తున్న శ్రీనివాస్ డాక్టర్ కదలికలపై సమాచారం అందించేవాడని పోలీసులు తెలిపారు.

ఆ సమాచారం ఆధారంగా బానోత్ రమేష్ పలుమార్లు వైద్యుడికి ఫోన్ చేసి, “మీపై రూ.15 కోట్ల సుపారీ వచ్చింది.. డబ్బులు ఇవ్వకపోతే హత్య చేస్తాం” అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు అందుకున్న హన్మకొండ పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ వివరాలు, నిఘా ద్వారా నిందితుల కదలికలను గుర్తించారు. బుధవారం (జూలై 8) మరోసారి ఆస్పత్రి వద్ద రెక్కీ నిర్వహించేందుకు వస్తుండగా ములుగు క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటాడి వారిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన నాలుగు మొబైల్ ఫోన్లు (వివో, హువావే, వివో వై12, రియల్‌మీ)తో పాటు హీరో షైన్ మోటార్ సైకిల్ (నంబర్: TG07-D-7684)ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ కె. కిషోర్, ఏవో సల్మాన్, హెడ్ కానిస్టేబుళ్లు రాహూఫ్, సోము నాయక్, కానిస్టేబుళ్లు రమణ, మహిపాల్, హెచ్‌జీ రవి, కుమారస్వామిలను సీఐ మచ్చ శివకుమార్ అభినందించారు.

ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు సూచనలు చేశారు. ఎవరైనా బెదిరింపు కాల్స్ చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా అత్యవసర పోలీసు సేవలకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here