తెలంగాణ మా అయ్య జాగిరే

తెలంగాణలో జనసేన కార్యకలాపాలు, నవనిర్మాణ సంకల్ప సభ వివాదం నేపథ్యంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన మంత్రి, “తెలంగాణ మా అయ్య జాగీరే.. మీ అయ్య జాగీరు కాదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజలు దశాబ్దాల పాటు పోరాటం చేశారని, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలతో రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. అలాంటి తెలంగాణపై ఎవరు పడితే వారు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణను తమ అయ్య జాగీరా అని ప్రశ్నించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.పవన్ కళ్యాణ్ గతంలో స్వయంగా ఆంధ్రప్రదేశ్‌లో తన పరిస్థితిపై మాట్లాడారని, “ఏపీలోనే పీకలేక పోతున్నా” అన్న వ్యక్తి ఇప్పుడు తెలంగాణలోకి వచ్చి రాజకీయాలు చేయాలని చూడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో సభలు నిర్వహించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.అలాగే పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ఆరోపించిన మంత్రి, “బీజేపీ వాళ్లు ఎవరో స్క్రిప్ట్ రాసి ఇస్తున్నారు. కానీ ఆ స్క్రిప్ట్ కూడా సరిగా రాయడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయి” అని ఎద్దేవా చేశారు. సినిమాల్లో నటుడిగా విజయవంతమైన పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ రాజకీయాల్లో పరీక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.తెలంగాణకు రావడాన్ని ఎవరూ అడ్డుకోవడం లేదని స్పష్టం చేసిన మంత్రి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే కావాలనే రాజకీయ సభలు నిర్వహించి వివాదాలు సృష్టించే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ ఆంధ్ర ప్రజలను గౌరవించారని, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు.పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా? తెలంగాణ అమరవీరుల కోసం ఎప్పుడైనా పోరాడారా? అని ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్, గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల వ్యతిరేకంగా మాట్లాడిన అంశాలను కూడా గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కళ్యాణ్ ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ప్రయత్నాలపై కాంగ్రెస్ నేతలు, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రారంభమైన ఈ రాజకీయ వివాదం రానున్న రోజుల్లో మరింత వేడెక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here