వరంగల్ పరిసర ప్రాంతమైన బొల్లికుంటలో నాన్-లే అవుట్ ప్లాట్ల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.సర్వే నెంబర్ 505 ఏ/ఏ,505/బీ/బీ లో వ్యవసాయ భూమికి నాలా కన్వర్షన్ చేయించుకుని, ఎలాంటి అనుమతులు లేకుండానే నాలుగు రాళ్లు పాతి ప్లాట్లుగా విభజించి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ భూమిని ప్లాట్లుగా మార్చి ఇప్పటికే సగానికి పైగా విక్రయించి భారీ మొత్తంలో సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. సంబంధిత శాఖల అనుమతులు లేకుండా నాన్-లే అవుట్ ప్లాట్లను విక్రయించడం మాత్రమే కాకుండా, వాటి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రత్యేకంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎలా అనుమతించిందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. లేఅవుట్ అనుమతులు, మౌలిక సదుపాయాల ప్రమాణాలు, పట్టణాభివృద్ధి నిబంధనలపై సంబంధిత అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.
సర్వే నెంబర్ 505లో జరుగుతున్న ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారంపై రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, రిజిస్ట్రేషన్ శాఖలు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వెనుక కారణాలేమిటన్న చర్చ సాగుతోంది. అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ, బొల్లికుంటలో మాత్రం నిబంధనల ఉల్లంఘనలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరిగినట్లయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, కొనుగోలుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



