జూన్ 6న జంతర్ మంతర్‌కు రండి: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ పిలుపు
దేశ విద్యావ్యవస్థలో ఇటీవల చోటు చేసుకున్న పలు వైఫల్యాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న శాంతియుత నిరసన కార్యక్రమంలో యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అభిజిత్ దీప్కే, నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు జూన్ 6న భారత్‌కు చేరుకోనున్నట్లు వెల్లడించారు. దేశ భవిష్యత్తుకు సంబంధించిన విద్యా రంగ సమస్యలపై ప్రభుత్వం జవాబుదారీతనం వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యా రంగంలో చోటు చేసుకున్న లోపాలు, పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలు, విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
“జంతర్ మంతర్ వద్ద జరిగే ఈ శాంతియుత నిరసనలో పాల్గొని, ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కోరే మన రాజ్యాంగ హక్కును వినియోగించుకోవాలి. భారత యువత అంతా కలిసి తమ స్వరాన్ని వినిపించాలి” అని అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు.
జూన్ 6న జరిగే ఈ నిరసన కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విద్యా రంగ సమస్యలపై ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.



