విద్యాశాఖ అధికారులు ఎం చేస్తున్నట్లు..?

వరంగల్ జిల్లాలో నిర్వహణలో ఉన్న “భరత్ స్కూల్” వ్యవహారం ప్రస్తుతం పలు అనుమానాలకు దారితీస్తోంది. పాఠశాల అనుమతులు, బోర్డులు, సిలబస్ వివరాల్లో వ్యత్యాసాలు ఉండటంతో పాటు విద్యాశాఖ అధికారుల వ్యవహారశైలిపై కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం, పర్మిషన్ పత్రాల్లో “భరత్ స్కూల్”గా నమోదు ఉండగా, స్కూల్ బోర్డుపై మాత్రం “భరత్ పబ్లిక్ స్కూల్” అని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా అనుమతులు స్టేట్ సిలబస్‌కు తీసుకున్నప్పటికీ, స్కూల్‌లో మాత్రం సీబీఎస్‌ఈ సిలబస్ పేరుతో ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో వరంగల్ డీఈఓ కార్యాలయం, సంబంధిత ఎంఈఓ కార్యాలయం, అలాగే ఎంఈఓ ఆఫీస్‌లోని ఓ సీనియర్ అసిస్టెంట్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ, విద్యాశాఖ అధికారులు మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అంతేకాకుండా, పాఠశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ పూర్తికాకముందే ఎన్‌ఓసీ ఎలా జారీ అయిందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. టాయిలెట్లు లేవని నివేదికలు ఉన్నప్పటికీ, అనుమతులు ఎలా మంజూరయ్యాయో స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాల నిర్వహణ జరుగుతున్న భవనం కమర్షియల్ బిల్డింగ్‌గా ఉందని, అలాంటి భవనంలో విద్యాసంస్థ నిర్వహణకు నిబంధనలు అనుమతిస్తాయా లేదా అన్న దానిపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పాఠశాల యాజమాన్యానికి విద్యాశాఖలోని కొందరు అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఆరోపణలపై సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here