అంతా నేను చూసుకుంటా..

ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ కు అసలు సబ్ రిజిస్ట్రార్ భరోసా..?

ఇంచార్జ్‌, అసలు సబ్‌ రిజిస్ట్రార్‌లపై తీవ్ర ఆరోపణలు

ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లతో కలిసి అక్రమ వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు

వరంగల్‌ పోచమ్మ మైదాన్‌ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్కరు కాదు ఇద్దరు అధికారులు తమ అవినీతి వ్యవహారాలను ఎలాంటి అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కార్యాలయంలో ప్రస్తుతం ఇంచార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న ఓ అధికారి ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లను మధ్యవర్తులుగా పెట్టుకొని ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ ఇంచార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌కు అసలు సబ్‌ రిజిస్ట్రార్‌ పూర్తి అండదండలు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు పోచమ్మ మైదాన్‌ కార్యాలయంలో విధులు నిర్వహించిన అసలు సబ్‌ రిజిస్ట్రార్ ప్రస్తుతం హనుమకొండలోని వడ్డేపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, పోచమ్మ మైదాన్‌ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ ఇప్పటికీ తానే పర్యవేక్షిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇంచార్జ్‌ అధికారికి ఇక్కడ పూర్తి రిజిస్ట్రేషన్‌ అధికారాలు లేకపోయినా, అసలు అధికారాలన్నీ కట్టబెట్టి వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “ఏం జరిగినా నేను చూసుకుంటా… మీరు వసూళ్లు కొనసాగించండి” అంటూ అసలు సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంచార్జ్‌ అధికారికి భరోసా ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లకు కార్యాలయంలో రెడ్‌ కార్పెట్‌ పరుస్తూ, ప్రజల పనులు మధ్యవర్తుల ద్వారానే పూర్తయ్యే పరిస్థితి నెలకొన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారిక రుసుములకు మించి భారీ మొత్తాలు డిమాండ్‌ చేస్తున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పని త్వరగా కావాలంటే ప్రత్యేక రేట్లు, ఆలస్యం కాకుండా ఉండాలంటే వేరే రేట్లు అంటూ బహిరంగంగానే డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవల ఈ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై పలు కథనాలు న్యూస్ 10 లో వెలవడుతున్న నేపథ్యంలో అసలు సబ్ రిజిస్ట్రార్ ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ కు పూర్తి భరోసా ఇస్తున్నట్లు తెలుస్తుంది…ఇదే సమయంలో హనుమకొండ జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఇటీవల ఏసీబీ దాడులు జరగగా ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి సస్పెండ్‌ అయ్యారు. వారి స్థానంలో ప్రస్తుతం పోచమ్మ మైదాన్‌ అసలు సబ్‌ రిజిస్ట్రార్‌ విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.అక్కడ విధులు నిర్వహిస్తూనే ఇక్కడ కూడా వ్యవహారాలు నడిపిస్తూ రెండు చోట్ల వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఇప్పుడు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ ఇద్దరు అధికారుల వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపడితే మరిన్ని అవినీతి కోణాలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు, బాధితులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here