రాష్ట్రంలోని రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే ప్రజా ప్రభుత్వానికి నిజమైన ఆశీర్వాదమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం దండగ కాదని, పండుగ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.
గడిచిన తొమ్మిది రోజుల్లో రాష్ట్రంలోని 73.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసిన సందర్భంగా ఈ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా చివరి విడతగా 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,009.15 కోట్లను విడుదల చేసిన సీఎం, ఈ-పట్టాదారు పాసుపుస్తకాల జారీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
రైతులను రాజును చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్న సీఎం, గత 30 నెలల్లో వ్యవసాయ రంగం కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ, పంటల బీమా, గిట్టుబాటు ధరలు, సన్నవడ్లకు బోనస్, ఉచిత విద్యుత్, పంట నష్టపరిహారం వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచామని చెప్పారు. రైతు భరోసా కింద ఒక్క 30 నెలల్లోనే రూ.36,135 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.
రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.8.11 లక్షల కోట్ల అప్పులతో బాధ్యతలు చేపట్టినా, గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 67,717 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని సీఎం తెలిపారు. మొక్కజొన్న రైతుల కోసం రూ.3,504 కోట్లను విడుదల చేసినట్లు కూడా వెల్లడించారు.
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029 మే లేదా జూన్లో జరిగే అవకాశం ఉందని అంచనా వ్యక్తం చేసిన సీఎం, అప్పటికి రాష్ట్రంలో లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు పెరుగుతాయని అన్నారు. ప్రజా ప్రభుత్వ మంత్రులు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.



