కాపు ఉద్యమ నేత ఇకలేరు…

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత

హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస

ముద్రగడ మృతిని ధృవీకరించిన కుమారుడు గిరి

నాలుగుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీగా విజయం

ఎన్టీఆర్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలు

కాపు ఉద్యమ నేతగా రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర

అమరావతి/కిర్లంపూడి: మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం మృతి చెందిన విషయాన్ని ఆయన కుమారుడు ముద్రగడ గిరి ప్రకటించారు.

ముద్రగడ భౌతికకాయాన్ని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహానికి తరలించనున్నట్లు గిరి తెలిపారు. బుధవారం ఉదయం భౌతికకాయాన్ని కిర్లంపూడికి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానం

1953 జనవరి 22న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముద్రగడ.. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన.. 1983, 1985, 1989 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన రాజకీయ జీవితంలో మొత్తంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ మంత్రివర్గంతో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ముద్రగడ.. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.

కాపు ఉద్యమంలో కీలక నేత

కాపు సామాజికవర్గ సమస్యలు, రిజర్వేషన్ల అంశంపై ముద్రగడ పద్మనాభం సుదీర్ఘకాలం ఉద్యమించారు. కాపు ఉద్యమ నేతగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేతగా, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందించే నాయకుడిగా ముద్రగడ గుర్తింపు పొందారు.ముద్రగడ పద్మనాభం మృతితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సీనియర్ నేత ప్రస్థానం ముగిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here