ఎంత తవ్వితే అంత… ! గోపాలపురం లో అడ్డగోలు మట్టి తవ్వకాలు

వరంగల్ అర్బన్ జిల్లాలో మొరం తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండాపోతుంది… మైనింగ్ అధికారుల సహకారంతో కొంతమంది మొరం దందా నిర్వహిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు.. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములు, పంచారాయి భూములపై కన్నేసిన మైనింగ్ వ్యాపారులు అధికారుల సహకారంతో నామమాత్రంగా అనుమతులు తీసుకొని యథేచ్ఛగా మొరం తవ్వకాలకు పాల్పడుతూ గ్రామాల్లో మొరం మొత్తం నగరాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఎదో కొంత మొరం తవ్వుకుంటామని మైనింగ్ శాఖ నుంచి అనుమతి తెచ్చుకొని కావాల్సిన ప్రభుత్వ రుసుము చెల్లించి దానిని ఆధారంగా చేసుకొని వేల క్యూబిక్ మీటర్ల మొరం తరలించుకు పోతున్నట్లు తెలిసింది. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురం గ్రామంలో గల పెద్ద చెరువు పక్కన ఉన్న బోడగుట్ట వద్ద ఇష్టారీతిన మొరం తవ్వకాలు కొనసాగిస్తూ వందల కొద్దీ టిప్పర్ ల మొరాన్ని నగరానికి తరలిస్తు లక్షల రూపాయల అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పది నిమిషాలకో టిప్పర్ మొరం లోడ్ చేసుకొని గ్రామం దాటి వెళ్తోందని గ్రామస్తులు అన్నారు.

ఎంత తవ్వితే అంత... ! గోపాలపురం లో అడ్డగోలు మట్టి తవ్వకాలు- news10.app

ఇది అసలు దందా…

గోపాలపురం గ్రామంలో కోమసాగుతున్న మొరం అక్రమ తవ్వకాలపై గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం

గ్రామంలోని బోడగుట్ట వద్దగల 392 సర్వే నెంబర్లో 32 ఎకరాల భూమిని ఓ మైనింగ్ వ్యాపారి లీజుకు తీసుకున్నాడు… నిజానికి ఇది రెవెన్యూ రికార్డుల ప్రకారం గ్రామానికి చెందిన పంచారాయి భూమి ఐయిన అధికారులు క్రషర్ నిర్వహణ కోసమని ఆ వ్యాపారికి ఉన్న పట్ట భూమితో పాటు 32 ఎకరాలు కట్టబెట్టారు… అప్పటినుంచి ఆ వ్యాపారి అక్కడ క్రషర్ నిర్వహిస్తూ బోర్ బ్లాస్టింగ్ ల ద్వారా గ్రామస్తులను భయానికి గురి చేస్తున్నాడు…. క్రషర్ నిర్వహణకు కావాల్సిన కనీస నిబంధనలు పాటించకపోగా వందల ఫీట్ల కొద్దీ బండకోసం బ్లాస్టింగ్లు చేస్తూ భూమిని మొత్తం తవ్వి వదిలేసాడు… ఇంత జరుగుతున్న తవ్వేసిన వందల ఫీట్ల కొద్దీ లోతు ఉన్న గోతుల వల్ల ప్రమాదం ఉన్న మైనింగ్ అధికారులు కేవలం ప్రేక్షక పాత్ర ఫోషిస్తున్నారు… కేవలం అనుమతులు ఇవ్వడం తప్ప ఆతర్వాత అటువైపు కన్నెత్తి చూడడం కూడా చేయరు… అనుమతులు ఉన్నాయనే సాకుతో నిబంధనలను ఉల్లంఘించి కనీస రక్షణ చర్యలు లేకుండా క్రషర్ నడుపుతూ భారీగా వెనకేసుకున్న ఈ మైనింగ్ వ్యాపారి ప్రస్తుతం ఇదే గ్రామంలో పంచారాయి భూమిలో మొరం తవ్వకాలకు తెరలేపాడు… ఎదో ఒక అనుమతి ఉంది తనకు అని చూపాలి కనుక మైనింగ్ శాఖ నిబంధనల మేరకు 15 వేల రూపాయలు చెల్లించి 500 క్యూబిక్ మీటర్ల మొరం తవ్వకానికి అనుమతి తెచ్చుకున్నాడు… ఇదంతా బాగానే ఉన్నా తాను తెచ్చుకున్న 5వందల క్యూబిక్ మీటర్ల అనుమతితో వేల కొద్దీ క్యూబిక్ మీటర్ల మొరాన్ని ఇప్పటికే ఆ మైనింగ్ వ్యాపారి కొట్టుకుపోయాడట…. ఎర్రగట్టు గుట్ట వద్ద ఉన్న ఓ కళాశాల మైదానంలో ఇప్పటికే 500 ట్రిప్పుల టిప్పర్ మొరాన్ని పోసి సొమ్ము చేసుకున్నారట.

తెచ్చుకున్న అనుమతి 5వందల క్యూబిక్ మీటర్లు అంటే 20 ట్రాక్టర్ల లోడ్ అవుతుంది… కానీ ఇందుకు విరుద్ధంగా వందల కొద్దీ టిప్పర్ ల మొరం ఎందుకు తవ్వుతున్నట్లని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు… 5 వందల క్యూబిక్ మిటర్లని అనుమతి ఇచ్చిన మైనింగ్ అధికారులు వందల కొద్దీ క్యూబిక్ మీటర్లు అడ్డగోలుగా తవ్వుతూ ఉన్న కనీసం ఎలాంటి తనిఖీలు చేయకుండా ఎందుకు కళ్ళు మూసుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు… గ్రామస్తులు ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా యథేచ్ఛగా మొరం తరలిస్తున్నారు తప్ప పనిని మాత్రం ఆపడం లేదని గ్రామస్తులు తెలిపారు… గ్రామ సర్పంచ్, పాలకవర్గం వివిధ పార్టీ నాయకులు మొరం తవ్వుతున్న ప్రాంతాన్ని పరిశీలించి అడ్డగోలు తవ్వకాలు ఆపాలని చెప్పిన ఆ మైనింగ్ వ్యాపారికి చీమ కుట్టినట్లైన లేదట… దూరాన్ని బట్టి టిప్పర్ లోడ్ మొరాన్ని 5 వేల నుంచి 8 వేల వరకు విక్రయిస్తూ ఆ వ్యాపారి ఇప్పటికే లక్షల రూపాయలు వెనకేసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మైనింగ్ అధికారులు వేడుక చూస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఈ అనుమతి డిసెంబర్ 15 నుంచి జనవరి 4 వరకు చెల్లుబాటు అవితుందని అనుమతి ఇచ్చిన మైనింగ్ అధికారులు 5వందల క్యూబిక్ మీటర్లు ఎన్ని రోజులు తవ్వుతారు..? ఎన్ని లోడ్ల మొరం వస్తుంది ఆమె అవగాహన లేకుండా ఉన్నారా అని గ్రామస్తులు అడుగుతున్నారు. అనుమతి ఇచ్చి చేతులు దులుపుకుంటే క్షేత్ర స్థాయిలో ఏజరుగుతుందో ఎవరు పరిశీలించాలో అధికారులకే తెలియాలని అంటున్నారు.

మైనింగ్ శాఖ నిర్లక్ష్యం…

15 వేల రూపాయలు సర్కారుకు చెల్లించి 5 వందల క్యూబిక్ మీటర్ల మొరం తవ్వకానికి అనుమతి పొంది వందల కొద్దీ తవ్వుతున్న ఇప్పటికి మైనింగ్ అధికారులు గమ్మున ఉండడం వెనుక పలు అనుమానాలకు తావిస్తోంది… ఆ మైనింగ్ వ్యాపారితో అధికారులు మిలాఖత్ కావడం వలల్లే ఎన్ని వందల క్యూబిక్ మీటర్లు తవ్విన కిమ్మనడం లేదనే విమర్శలు వస్తున్నాయి. టిప్పర్ ల కొద్దీ మొరం కళ్ళ ముందు అక్రమంగా తరలించుకు పోతుంటే పోలీస్, రెవెన్యూ అధికారులు సైతం ఇదేంటని ప్రశ్నించడం లేదని ఫలితంగా ఎలాంటి భయం లేకుండా ఇష్టారీతిన మొరాన్ని తరలిస్తూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు చెప్పారు. ఇకనైనా మైనింగ్ అధికారులు కళ్ళు తెరవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రైతుల అవసరానికి మట్టి కావాలంటే అనుమతి కోసం వెళ్తే ముప్పు తిప్పలు పెట్టి పట్టా భూమి కావాలి అని చెప్పే మైనింగ్ అధికారులు లక్షల రూపాయల మొరాన్ని ఓ మైనింగ్ వ్యాపారి అక్రమంగా విక్రయిస్తుంటే అడ్డగోలుగా తవ్వుకు పోతుంటే ఎలా ఉరుకుంటున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

రైతులకు నష్టం… పెండ్యాల తిరుపతి , రైతు

అడ్డగోలుగా మొరం తవ్వకాల వల్ల రైతులకు నష్టం జరుగుతుంది… పది నిమిషాలకో టిప్పర్ పంటపొలాల మీదుగా వెళ్లడం వల్ల పంట చెలు మొత్తం దుబ్బ నిండుకుంటుంది… దీనివల్ల పంట నష్టం జరుగుతుంది. బోడగుట్ట వద్ద 25 ట్రిప్పుల మొరం తవ్వకానికి అనుమతి తీసుకొని వేల ట్రిప్పుల మొరం తరలిస్తున్నారు. మైనింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని తవ్వకాలను నిలిపివేయాలి.

మా మట్టి కొట్టుకు పోతున్నాడు… కన్నం ప్రభాకర్ రావు, రైతు

తమ గ్రామానికి చెందిన మట్టిని అనుమతులు ఉన్నాయనే సాకుతో వేల ట్రిప్పుల కొట్టుకుపోతున్నారు. గుట్ట కాడి భూమిలో మట్టిని తవ్వి నగరానికి తరలిస్తున్నారు. రోజుకు 60నుంచి 70 ట్రిప్పుల మొరం టిప్పర్ లల్లో తరలుతుంది.. ఇప్పటికైనా అధికారులు స్పందించి మొరం తవ్వకాలను ఆపాలి.

తవ్వకాలు ఆపండి…. మాషీపెల్లి భాస్కర్ రావు, సర్పంచ్

గోపాలపురం గ్రామం లో అక్రమంగా తవ్వుతున్న మొరం తవ్వకాలను ఇకనైనా ఆపాలి. 5 వందల క్యూబిక్ మీటర్ల అనుమతితో రోజుకు 2 వేల క్యూబిక్ మీటర్ లు తవ్వుతున్నారు… ఈ లెక్కన జనవరి 4 అనుమతి కాలం ముగిసేవరకు 20 వేలకు పైగా క్యూబిక్ మీటర్లు తవ్వుతారు… మైనింగ్ అధికారులు వెంటనే బోడగుట్ట వద్ద జరుగుతున్న తవ్వకాలను పరిశీలించి తవ్వకాలను ఆపివేయాలి… ఇలా తవ్వుకుంటు పోతే గ్రామ అవసరాలకు మట్టి లేకుండాపోతుంది. అనుమతి కంటే ఎక్కువగా తవ్విన బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి… తవ్వకాలను వెంటనే నిలిపివేయకుంటే గ్రామస్తులతో కలిసి ఆందోళన చేస్తాం.. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.