కాలుష్యం బారిన నక్కలపల్లి

నిబంధనల కు విరుద్ధంగా నక్కలపల్లి లో రైస్ మిల్లులు
మిల్లు వ్యర్థాలతో గ్రామంలో భరించరాని దుర్గంధం
పారాబోయిల్డ్ రైస్ మిల్లులతో గ్రామస్తులకు తిప్పలు
మిల్లుల నుంచి వచ్చే వ్యర్థపు నీరు చెరువులోకి
జాడలేని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు
రహదారి పక్కకు వ్యర్థపు నీరు నిలిచి చెరువును తలపిస్తున్న వైనం
మిల్లు యజమానులకు ఎంత చెప్పినా పట్టించుకోరు…. అధికారులు అటువైపు చూడరు..

కాలుష్యం బారిన నక్కలపల్లి- news10.app

వరంగల్ నగరంలోని ఐదవ డివిజన్ నక్కలపల్లిలో పారబాయిల్డ్ రైస్ మిల్లులు గ్రామాన్ని కాలుష్యం బారిన పాడేస్తున్నాయి. కాసుల యావ తప్ప మిల్లుల వల్ల కాలుష్యం అవుతుందన్న కనీస పట్టింపు యాజమాన్యాలకు లేకపోవడం మూలంగా గ్రామం లోని ప్రజలు మిల్లులు వెదజల్లుతున్న కాలుష్యం వల్ల నానా అవస్థలు పడుతున్నారు. గ్రామస్తులు అనేకమార్లు మిల్లు యజమానులకు కాలుష్యం గూర్చి పిర్యాదు చేసిన చేస్తున్న తప్పును సరిదిద్దుకోపోగా… తమను ఎవరేం చేస్తారులే అనే నిర్లక్ష్య ధోరణిలో ఉన్నట్లు తెలిసింది.

మిల్లుల కాలుష్యం …

వరంగల్ నగరం లోని ఐదవ డివిజన్ లోని నక్కలపల్లి గ్రామంలో మొత్తం ఎనిమిది రైస్ మిల్లులకు పైగా ఉన్నాయి వీటిలో కొన్ని స్టేక్ రైస్ మిల్లులు కాగా నాలుగు పైగా పారబాయిల్డ్ రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ పారబాయిల్డ్ రైస్ మిల్లులు నిభందనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పార బాయిల్డ్ రైస్ మిల్లులు తమ మిల్లు ఆవరణలో వ్యర్థపు నీరు పోవడానికి ట్యాంక్ ను నిర్మించుకోవాలి. చుక్క నీటిని కూడా బయటకు వదలకూడదు. కానీ ఇక్కడ రైస్ మిల్లుల యజమానులు తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. పార బాయిల్డ్ రైస్ మిల్లులోంచి వచ్చే వ్యర్థపు నీటినంతటిని బయటకు వదులుతున్నారు. దింతో ఈ నీరు అంత రహదారి పక్కనే నిలుస్తూ దోమలు, ఈగలకు నిలయంగా మారి భరించరాని దుర్గంధంతో గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై నుంచి వెళ్ళాలంటేనే ప్రజలు బలవంతంగా ముక్కులు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు అంటున్నారు. ఈ దుర్గంధం మూలంగా కొంతమంది గ్రామస్తులు రోగాల బారిన పడినట్లు తెలిసింది. ఇంత జరుగుతున్నా మిల్లు యజమానుల్లో ఎంతమాత్రం చలనం లేదు. నినందనలకు విరుద్ధంగా నీటిని అలాగే రోడ్డుపైకి వదులుతున్నారు తప్ప ఎంతమాత్రం తగ్గడం లేదు.

కాలుష్యం బారిన నక్కలపల్లి- news10.app

చెరువు కలుషితం

ఈ పార బాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి వచ్చే వ్యర్థపు నీరు గ్రామం లోని రహదారికి ఇరువైపులా నిలవడమే కాకుండా సమీపంలోని స్థానిక చెరువులోకి వ్యర్థపు నీరంతా చేరుతోంది. దీని వల్ల చెరువులో ని నీరంతా పూర్తిగా కలుషితం అవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నీటి కలుషితం వల్ల చెరువులోని చేపలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో స్థానిక ముదిరాజులు వీరిపై పిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకున్న పాపానపోలేదని గ్రామస్తులు ఆరోపించారు.

చెరువును తలపిస్తున్న వ్యర్థపు నీరు

కాలుష్యం బారిన నక్కలపల్లి- news10.app

నక్కలపల్లి పార బాయిల్డ్ రైస్ మిల్లు నుంచి వస్తున్న వ్యర్థపు నీరు గ్రామ సమీపంలో నిలిచి చెరువును తలపిస్తోంది. దాదాపు ఎకరం స్థలంలో ఈ వ్యర్థపు నీరు నిలిచి భరించరాని దుర్గందాన్ని వెదజల్లుతుంది. పారబాయిల్డ్ రైస్ మిల్లుల నుంచివచ్చే వ్యర్థపు నీరు అంతా ఇక్కడే నిలిచి పోతుండడంతో వ్యర్థపు నీటి చెరువు ఇక్కడ ఏర్పడింది. కొద్దీ నెలలుగా ఈ వ్యర్థపు నీరు ఇక్కడే నిలవడం మూలంగా వాసన, దోమలతో జనం సతమతమవుతున్నారు.

పొల్యూషన్ అధికారులు ఎక్కడ..?

కాలుష్యం బారిన నక్కలపల్లి- news10.app

నక్కలపల్లి లో పారబాయిల్డ్ రైస్ మిల్లులు ఇంతగా కాలుష్యం వెదజల్లుతున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇప్పటికి అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం గ్రామస్తులు ఎన్నిసార్లు పిర్యాదు చేసిన పట్టించుకోలేదు. గ్రామం మొత్తం వ్యర్థపు నీటితో కాలుష్యపు బారిన పడిన ఈ అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. మిల్లులు యాజమాన్యాలు ఈ అధికారులను ప్రసన్నం చేసుకోవడం వల్ల చర్యలు తీసుకోవడం లేదని సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా ఈ మిల్లులను పరిశీలించి కాలుష్యాన్ని అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిబంధనలు పాటించని మిల్లులను సీజ్ చేయాలని కోరుతున్నారు.