ఉద్యమ తార నింగికెగిసింది….

ఉద్యమ తార నింగికెగిసింది గత కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టు విప్లవ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన ఆర్కే అలియాస్ అక్కరాజు హరగోపాల్ అంత్యక్రియలు మావోయిస్టులు ,స్థానిక ప్రజలు అశ్రునయనాల మధ్య శనివారం ముగిసినట్లు మావోయిస్తు పార్టీ ప్రకటించింది.అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది మావోయిస్టు పార్టీ….

తెలంగాణ సరిహద్దులో ని ప్రాంతంలోని పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తి ఐయినట్లు తెలిపింది ఈ అంత్యక్రియలకు భారీగా మావోయిస్టులు హాజరుకాగా మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు తెలిసింది. కాగా ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు.

ఆర్కే మృతి నిజమే.. మావోయిస్ట్ పార్టీ అధికారిక ప్రకటన

మూత్రపిండాల వైఫల్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆర్కే మరణించినట్లు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. గురువారం ఉదయం 6 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించింది.మావోయిస్ట్ అగ్రనేత రామకృష్ణ మృతిపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. ఆర్కే మరణ వార్త నిజమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ” సీపీఐ (మావోయిస్ట్) కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు రామకృష్ణ ఈ నెల 14న ఉదయం 6 గంటలకు మరణించారు. కామ్రేడ్ హరగోపాల్‌ అలియాస్ ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య తలెత్తింది. వెంటనే డయాలసిస్ ట్రీట్‌మెంట్ ప్రారంభించి వైద్యం అందిస్తున్న క్రమంలో మూత్రపిండాలు విఫలమై, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి అమరుడయ్యారు. మంచి వైద్యం అందించినా ఆయన్ను కాపాడుకోలేకపోయాం. కామ్రేడ్ ఆర్కేకు విప్లవ శ్రేణుల మధ్యే అంత్యక్రియలు నిర్వహించి శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది. కామ్రేడ్ రామకృష్ణ అమరత్వం పార్టీకి తీరని లోటు. ” అని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేర్కొన్నారు.రామకృష్ణ అనారోగ్యంతో మరణించారని, ఇప్పటికే అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని గురువారం ఛత్తీస్‌గఢ్ డీజీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఛత్తీస్‌గఢ్ పోలీసులు తప్ప మిగతా రాష్ట్రాలు ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆర్కే మృతిని మొదట విరసం నేతలు కొట్టిపారేశారు. పార్టీ పెద్దల నుంచి అధికారిక ప్రకటన వస్తేనే ఆర్కే మృతిపై క్లారిటీ వస్తుందని విప్లవ రచయితల సంఘం (విరసం) నేతలు అభిప్రాయపడ్డారు. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరిగిందని, స్పష్టత వచ్చే వరకు ఆయన మరణ వార్తలను నమ్మలేమని చెప్పారు. మొదట ఆర్కే భార్య శిరీష కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ మావోయిస్ట్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావడంతో.. ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కేకు చికిత్స అందకుండా చుట్టుముట్టి.. ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపించారు.

ఇది ఆర్కే నేపథ్యం…

ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరగోపాల్‌. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తుమ్రుకోట‌. నాలుగు ద‌శాబ్దాల క్రితం మావోయిస్టు ఉద్యమాలకు ఆకర్షితుడైన ఆర్కే.. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉద్య‌మ నేత‌గా మారిన స‌మ‌యంలోనే త‌న పేరును రామ‌కృష్ణ అలియాస్ ఆర్కేగా మార్చుకున్నారు. ఆ త‌ర్వాత విప్ల‌వోద్య‌మంలో అగ్ర‌నేత‌గా ఎదిగారు. మావోయిస్టు పార్టీలో అనేక కీలక పదవులను నిర్వహించారు. ఏపీ ఒడిశా స‌రిహ‌ద్దు ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా జరిగిన అనేక మావోయిస్టు దాడుల్లో ఆర్కే కీలక పాత్ర పోషించారని ఆయనపై కేసులు ఉన్నాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై బాంబు దాడి కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆయనను పట్టుకునేందుకు పోలీసులు అనేకసార్లు ప్రత్యేకంగా ఆపరేషన్లు నిర్వహించారు. కానీ చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు. ఉద్యమంలో సాకేత్, మధు, శ్రీనివాస్ వంటి మారుపేర్లతో ఆయన తిరిగారు.2004లో నాటి సీఎం వైఎస్ఆర్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపినప్పుడు.. మావోయిస్టుల తరపున చర్చలకు నాయకత్వం వహించారు ఆర్కే. ఆయన ఆచూకీ తెలిపిన వారికి రివార్డులు ప్రకటిస్తామని అనేక రాష్ట్రాలు ప్రకటించాయి. ఒడిశా ప్రభుత్వం రూ. 20 లక్షలు, చత్తీస్‌గఢ్ రూ. 40 లక్షలు, జార్ఖండ్ రూ. 12 లక్షలు, ఆంధ్రప్రదేశ్ రూ. 25 లక్షలు రివార్డులు ప్రకటించాయి. ఏపీలో బలిమెల ఎన్‌కౌంటర్ తరువాత ఆర్కే పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కే పరిమితమయ్యారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించి అక్టోబరు 14న మరణించినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here