జలమండలి జనరల్ మేనేజర్ ఎస్.ఎల్
రాష్ట్రవ్యాప్తంగా మరో భారీ అవినీతి గుట్టు రట్టయింది. హైదరాబాద్ జలమండలిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్) ఎస్.ఎల్. కుమార్ అక్రమ ఆస్తుల వ్యవహారం సంచలనంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు నిర్వహించారు.
హైదరాబాద్‌లోని మల్లాపూర్, వెంకటరమణ కాలనీలో ఉన్న కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఉదయం ప్రారంభమైన ఈ తనిఖీలు గంటల తరబడి కొనసాగాయి. అధికారుల తనిఖీల్లో బయటపడిన ఆస్తుల వివరాలు చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయినట్లు సమాచారం.
సోదాల్లో ఇంట్లో కుప్పలుగా నిల్వ ఉంచిన నగదు బయటపడింది. రూ.1.10 కోట్లకు పైగా క్యాష్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు పెద్ద మొత్తంలో ఉండటంతో నోట్ల కట్టలు లెక్కించేందుకు ప్రత్యేక కౌంటింగ్ మెషీన్లను తెప్పించాల్సి వచ్చింది. అదేవిధంగా సుమారు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే, నిజామాబాద్ జిల్లాలో మూడు ఎకరాల భూమి, హైదరాబాద్ నగర పరిధిలో ఆరు ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో మూడు విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, బ్యాంక్ లాకర్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఇంత భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టడం ఎలా సాధ్యమైందనే కోణంలో లోతుగా విచారణ కొనసాగుతోంది.
జలమండలిలో టెండర్లు, ప్రాజెక్టులు, కాంట్రాక్టుల వ్యవహారాల్లో భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. గత కొంతకాలంగా కుమార్ వ్యవహారశైలిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ఏసీబీ ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఏ స్థాయికి చేరుకుందో ఈ ఘటనతో మరోసారి బయటపడిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏసీబీ విచారణలో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది.



