హన్మకొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్డిఏ)లో డిప్యూటేషన్ ఉద్యోగుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ రాజ్ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన కొందరు ఉద్యోగులు దాదాపు పాతికేళ్లుగా అదే శాఖలో కొనసాగుతుండటంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సాధారణంగా డిప్యూటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు రెండేళ్ల వ్యవధి పూర్తయ్యాక తిరిగి మాతృశాఖకు వెళ్లాల్సి ఉండగా, ఇక్కడ మాత్రం ఆ నిబంధనలు అమలు కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బదిలీల ప్రక్రియకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఈసారి అయినా డిప్యూటేషన్ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయా..? వారు తమ మాతృశాఖలకు తిరిగి వెళ్తారా..? అనే చర్చ డిఆర్డిఏ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
బదిలీలు ఉన్నా కదలని ఉద్యోగులు..!
డిఆర్డిఏలో పనిచేస్తున్న ఏడుగురు డిప్యూటేషన్ ఉద్యోగులు ప్రధానంగా ఓ ఇద్దరు ఉద్యోగులు సంవత్సరాల తరబడి అదే కార్యాలయంలో కొనసాగుతున్నారని సమాచారం. వీరిలో ముఖ్యంగా ఇద్దరు ఉద్యోగులు కీలక విభాగాలపై పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. శాఖలో ఎవరిని ఎక్కడ నియమించాలి, ఏ ఫైల్ ముందుకు వెళ్లాలి, ఎవరు ఏ పోస్టులో పనిచేయాలి అన్న విషయాల్లో కూడా వీరి ప్రభావం ఉందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
“మాకు పైస్థాయి అండ ఉంది” అంటూ డాంబికాలు ..?
డిప్యూటేషన్‌పై వచ్చిన ఆ ఇద్దరు ఉద్యోగులు కలెక్టరేట్ నుంచి సచివాలయం వరకు తమకు బలమైన పరిచయాలు ఉన్నాయని చెబుతూ సొంత శాఖ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ పోస్టుల్లోకి ఇతరులను రానీయకుండా అడ్డుకుంటున్నారన్న వాదనలు కూడా ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి.దీంతో డిఆర్డిఏలో అసలు ఉద్యోగులకే అవకాశాలు తగ్గుతున్నాయనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. “డిప్యూటేషన్ పేరుతో వచ్చిన వారు శాశ్వత ఉద్యోగుల్లా వ్యవహరిస్తున్నారు” అని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
ఆ ఇద్దరు మహా ముదుర్లు..?
శాఖలో ఏ అధికారి వచ్చినా, బదిలీలు జరిగినా, పాలన మారినా ఇద్దరు ఉద్యోగులు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా తమ స్థానాలను కాపాడుకుంటూ వస్తున్నారనే చర్చ జరుగుతోంది. అధికార మార్పులు జరిగినప్పుడల్లా కొత్త అధికారులతో సాన్నిహిత్యం పెంచుకొని తమ స్థానాలను నిలబెట్టుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అవినీతి ఆరోపణలు.. అధికారుల మౌనం..?
డిప్యూటేషన్ ఉద్యోగులపై గతంలో కూడా పలు అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ, కొందరు అధికారులు వారిని కాపాడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఫైళ్ల వ్యవహారాల్లో జోక్యం, అంతర్గత వ్యవహారాల్లో అధిక ప్రాధాన్యం, నిర్ణయాలపై ప్రభావం వంటి అంశాలు శాఖలో చర్చనీయాంశంగా మారాయి.
ఈసారైనా బదిలీ జరుగుతుందా..?
రాబోయే బదిలీల జాబితాలో డిప్యూటేషన్ ఉద్యోగుల పేర్లు ఉంటాయా..? లేక మళ్లీ యథాతథంగానే కొనసాగుతారా..? అన్నది ఇప్పుడు హన్మకొండ డిఆర్డిఏలో హాట్ టాపిక్‌గా మారింది. నిబంధనల ప్రకారం డిప్యూటేషన్ గడువు పూర్తయిన వారిని మాతృశాఖలకు పంపిస్తారా..? లేక మరోసారి మినహాయింపులు ఇస్తారా..? అన్నది వేచి చూడాల్సి ఉంది.



