డి పి ఓ స్వాహా పర్వం..!

పంచాయితీ ఎన్నికల నిధులు మింగిన జిల్లా అధికారి…

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అవినీతి ఆనకొండ…

సామాన్య ప్రజలే కాదు తన క్రింది స్థాయి ఉద్యోగులు సైతం సారు బాధితులే..

పంచాయితీ ఎన్నికల నిర్వహణ ఫండ్ కోట్ల రూపాయలు ప్రసాదంగా మింగిన జిల్లా పెద్ద సారు.

తాజాగా పంచాయితీ కార్యదర్శుల బదిలీల్లో భారీగా చేతివాటం ప్రదర్శన…

ఒక్కొక్క కార్యదర్శి నుండి ముక్కు పిండి వేలల్లో వసూలు చేసి లక్షల్లో సొమ్ము చేసుకున్న సదరు డీ పీ ఓ..

జిల్లాలో ఎక్కడి గ్రామ పంచాయితీ విజిట్ కి వెళ్లినా ఆ గ్రామ కార్యదర్శి మూట ముట్టజెప్పాల్సిందే..

అవినీతి ,అక్రమాలు,బెదిరింపులతో తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న జిల్లా పెద్ద సారు…

గ్రామీణాభివృద్ధి, పంచాయితీల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన జిల్లా పంచాయితీ యంత్రాంగం ప్రస్తుతం అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ జిల్లా స్థాయి అధికారి వ్యవహారశైలి గత కొంతకాలంగా తీవ్ర విమర్శలకు గురవుతోంది. ప్రభుత్వ నిధుల వినియోగం, ఉద్యోగుల బదిలీలు, అధికార దుర్వినియోగం, బెదిరింపులు, వసూళ్లు వంటి అంశాలపై వరుసగా ఆరోపణలు వినిపిస్తుండటంతో శాఖలోనే అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి.
పంచాయితీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం ఆ
జిల్లాకు 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది నిర్వహణ, రవాణా, ఇతర పరిపాలనా ఖర్చుల కోసం వచ్చిన నిధుల వినియోగంపై ప్రస్తుతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసినా ఖర్చుల వివరాలు, లెక్కల సమర్పణ, మిగులు నిధుల అంశాల్లో స్పష్టత లేకపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం ఎటు వెళ్లిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారంపై పలువురు ఫిర్యాదులు చేయడంతో ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. అంతే కాకుండా జిల్లా కలెక్టర్ విచారణ కు కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇటీవల వెలుగులోకి వచ్చిన మరో అంశం పంచాయితీ కార్యదర్శుల బదిలీల వ్యవహారం. సాధారణ పరిపాలనా ప్రక్రియగా జరగాల్సిన బదిలీలు భారీ ఆర్థిక లావాదేవీలకు వేదికగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోరుకున్న మండలం, గ్రామం లేదా సౌకర్యవంతమైన పోస్టింగ్ కోసం కొందరు కార్యదర్శుల నుంచి వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు వసూళ్లు జరిగినట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బదిలీల జాబితాలో చోటు దక్కించుకోవాలన్నా, అనుకూల స్థానం పొందాలన్నా “సెట్టింగ్” తప్పదనే పరిస్థితి నెలకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా, జిల్లాలోని గ్రామ పంచాయితీలకు సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్, అభివృద్ధి పనుల ఆమోదాలు, పరిపాలనా అనుమతుల విషయంలో కూడా అనధికార ఒత్తిళ్లు కొనసాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు శాఖ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి కూడా దయనీయంగానే ఉందని తెలుస్తోంది. జిల్లాలోని గ్రామ పంచాయితీలకు తనిఖీల పేరుతో వెళ్లే సందర్భాల్లో సదరు అధికారి వ్యవహరిస్తున్న తీరు తీవ్ర అసంతృప్తికి కారణమవుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. చిన్నచిన్న లోపాలను పెద్దవిగా చూపించి ఒత్తిడి తీసుకురావడం, నచ్చని సిబ్బందిపై కక్షసాధింపు చర్యలకు దిగడం, మెమోలు జారీ చేస్తామంటూ భయపెట్టడం వంటివి చేస్తూ తన చేతి వాటాన్ని ప్రదర్శిస్తూ అందిన కాడికి దండుకోవడం సదరు జిల్లా అధికారికి వెన్నతో పెట్టిన విద్య.
గ్రామ పంచాయితీల అభివృద్ధి పనుల సమీక్ష కంటే వ్యక్తిగత ప్రభావం, అధికారం దర్పం ప్రదర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది కార్యదర్శులు, ఫీల్డ్ స్థాయి సిబ్బంది తమ సమస్యలను బయటపెట్టేందుకు కూడా భయపడుతున్న పరిస్థితి ఉందని సమాచారం. శాఖలో నెలకొన్న ఈ వాతావరణం వల్ల ప్రజలకు అందాల్సిన సేవలపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ఈ వ్యవహారాలపై ఫిర్యాదులు ఉన్నతస్థాయికి చేరిన నేపథ్యంలో ప్రాథమిక విచారణకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. ఎన్నికల నిధుల వినియోగం, బదిలీల ప్రక్రియ, పరిపాలనా నిర్ణయాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిగితే అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు.
ఇదిలా ఉండగా, సదరు అధికారిపై గతంలోనూ పలు ఆరోపణలు వెలువడినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లా పంచాయితీ వ్యవస్థలో నెలకొన్న అవకతవకలు, అధికార దుర్వినియోగం, నిధుల వినియోగంలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని శాఖ వర్గాలే చెబుతున్నాయి.

న్యూస్ 10 వరుస కథనాలతో బయటపడనున్న అధికారి  అక్రమాలు..!

పంచాయితీ ఎన్నికల నిధుల వినియోగం, కార్యదర్శుల బదిలీల్లో జరిగిన అక్రమాలు, అధికార దుర్వినియోగం, వసూళ్ల ఆరోపణలపై ఇప్పటికే పలు ఆరోపణలు వెలువడగా, న్యూస్ 10 ఆధారాలతో వరుస కథనాలు ప్రచురించేందుకు సిద్ధపడనుంది ప్రజాధనం సంబంధించిన అంశాల్లో పూర్తి స్థాయి పారదర్శకత కోసం బాధ్యుల పాత్రపై లోతైన పరిశీలన కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here