ఇంధనం కృత్రిమ కొరతకు కొందరు బంక్ యజమానులు కారణమవుతున్నారు… బంక్ లోకి వచ్చిన వాహనాలకు ఇందనం నింపకుండా క్యాన్లు, బాటిల్లలో నిబంధనలకు విరుద్దంగా వందల లీటర్ల కొద్ది ఇంధనం నింపుతూ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… ఇది తెలిసిన అధికారులు సైతం తమనేం చేయమంటారు…? అని వాహనదారులను ఎదురు ప్రశ్నిస్తున్నారు…
ఇది పరిస్థితి…






కాజీపేట మండల పరిధిలోని డీజిల్ కాలనీలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద సోమవారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంక్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, వాహనాలకు ఇంధనం నింపడం పక్కన పెట్టి, బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహించేలా పెద్ద ఎత్తున ప్లాస్టిక్ క్యాన్లు, బాటిళ్లలో డీజిల్, పెట్రోల్ నింపుతుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది.
బంక్ ఆవరణలో వాహనాలు బారులు తీరడం, మరోవైపు రోడ్డుపై భారీ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. చివరికి అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌కు కూడా దారి దొరకని రీతిలో వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి.
నగరం మొత్తం ఇదే పరిస్థితి:
కేవలం డీజిల్ కాలనీలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి.యాదవ నగర్,వడ్డెపల్లి ప్రశాంత్ నగర్,మడికొండ హన్మకొండ తదితర ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బంక్ నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా క్యాన్లలో ఇంధనాన్ని నింపుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, దీనివల్ల సామాన్య వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న బంక్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



