పెరుమాండ్ల “చీటింగ్”

చిట్టిల పేరుతో సామాన్యులకు టోకరా.

వృద్ధులు, వికలాంగులు, కూలీలను మోసం చేసిన కిషోర్ రెడ్డి.

ఏడాది గడిచినా డబ్బులు చెల్లించని వైనం.

ఐపి ఆర్డర్ తో డబ్బులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నం.

పరారీలో కిషోర్ రెడ్డి.

న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన బాధితులు.


రెక్కాడితే డొక్కాడని సుమారు 200 మంది నిరుపేదలు కూలీ పనులు చేసుకుని రూపాయి రూపాయి కూడగట్టి పోగేసుకున్న డబ్బులను పెరుమాండ్ల చిట్ ఫండ్ నిర్వాహకుడు కిషోర్ రెడ్డి గద్దలా ఎత్తుకొని వెళ్లిపోయాడు.కాయ కష్టం చేసి పోగేసుకున్న డబ్బులను వడ్డీ వస్తుందని ఆశతో ఉన్న ఊరు వాడని నమ్మి డబ్బులు దాచుకుంటే కోర్టు ఐపి ఆర్డర్ తో డబ్బులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…
శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన పెరుమాండ్ల కిషోర్ రెడ్డి తన ఇంటి పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా పెరుమాండ్ల చిట్ ఫండ్ పెట్టి అదే గ్రామానికి చెందిన వందలాదిమంది సామాన్యులను ముంచిన సంఘటన చోటు చేసుకుంది. చిట్ ఫండ్ ముసుగులో వికలాంగులు వృద్ధులు రైతు వ్యవసాయ కూలీలు రూపాయి రూపాయి కూడా కట్టుకొని దాచుకున్న డబ్బులను దోచుకుని ఉడాయించాడు. చిట్టి వ్యవధి కాలం పూర్తయిన డబ్బులు ఇవ్వకుండా సంవత్సరం నుండి ఇదిగో అదిగో అంటూ మోసం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.పెరుమాండ్ల చిట్ ఫండ్ లో రెండేళ్లపాటు చిట్టి కట్టిన సభ్యులకు ఇవ్వాల్సిన మొత్తం రూపాయలతో పాటు వడ్డీ చెల్లించకుండా సంవత్సరం వరకు చెప్పులరిగేలా తిరిగినా కూడా డబ్బులు చెల్లించకపోగా వాయిదా పేరుతో ఇబ్బందులకు గురి చేశాడని బాధితులు బోరున విలపించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం కొందరు,ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం మరికొందరు, అవసరాల కోసం దాచుకున్న వారు ఇంకొందరు ఇలా రకరకాల అవసరాల రీత్యా చిట్ ఫండ్ లో డబ్బులు దాచుకుంటే కోర్టు ఐపి ఆర్డర్ తో డబ్బులు దోచుకుని దర్జాగా తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల పెన్షన్ తీసుకుని డబ్బులు దాచుకున్న వాళ్లు కొందరు,రోజంతా ఎండకు వానకు కష్టపడి తిని తినక దాచుకున్న వాళ్లు మరి కొందరు ఇలా ఎవరిని తట్టిన వారి కళ్ల వెంట వచ్చేది కన్నీళ్లు మాత్రమే. ఏళ్ల తరబడి దాచుకున్న డబ్బులు సమయానికి చేతికందకపోయేసరికి బిక్కు బిక్కు మంటూ ప్రాణం అరచేతిలో పెట్టుకుని అల్లాడిపోయేవారు ఎందరో. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా చిట్ ఫండ్ ముసుగులో సామాన్యులకు నష్టం జరుగుతుందని తెలిసిన స్థానిక జిల్లా స్థాయి అధికారులు దృష్టి సారించకపోవడం విడ్డూరం.అయితే సామాన్యులను దోచుకుని కోర్టు నుండి ఐపీ ఆర్డర్ మండల అధికారులకు అందే వరకు చిట్ ఫండ్ నిర్వాహకులను పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారి తీస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చిట్టీల పేరుతో సామాన్యులను దోచుకుంటున్న వారిపై మండల అధికారులు దృష్టి సారించడంలో పూర్తిగా విఫలమయ్యారు. మోసం జరిగితే తప్ప స్పందించని ప్రభుత్వ అధికారుల తీరు పర్యవేక్షణ లేకపోవడంపై స్థానికంగా విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. పెరుమాండ్ల చిట్ ఫండ్ ముసుగులో మోసపోయిన సామాన్యులకు అధికారులు అండగా ఉంటారా..? లేదా? అన్నది వేచి చూడాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here