మానుకోట ఆర్టీఏలో అధికారులు ఇంకా తమ వసూళ్ల బరితెగింపుతనాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది… అంతే కాదు మానుకోట తో పాటు వరంగల్ జిల్లాల్లో సైతం ఈ వసూళ్ల దందా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ రెండు జిల్లాలకు బాస్ ఒకే అధికారి కావడం వల్ల ఆయన సహకారంతో ఇక్కడ ఏజెంట్లు,బ్రోకర్లు రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి…ఈ బాసే కొందరు ఏజెంట్లకు తానే దుకాణాలు తెరవడానికి , షెడ్స్ వేసుకోవడానికి అవసరమైన అనుమతులను మున్సిపల్ నుంచి ఇప్పించినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి…జర్నలిస్టులు వార్తలు రాస్తే మనం ఎదురుదాడి చేద్దాం.. లేనిపోని ఆరోపణలు చేసి బద్నాం చేసే ప్రయత్నం చేద్దాం… అంటూ ఈ రెండు జిల్లాల బాస్ ఏజెంట్లకు ఎక్కడలేని ధైర్యం నూరి పోస్తున్నట్లు సమాచారం… ఆ ధైర్యం తో కొందరు ఏజెంట్లు న్యూస్10 ప్రతినిధులకు ఫోన్ చేసి మా సార్ సత్య హరిచ్చంద్రుడు అని నమ్మబలుకుతూనే బెదిరింపులు సైతం చేస్తున్నారు…అసలు రవాణ శాఖలో మా సార్ అంత అత్యంత నిజాయితీ పరుడు లేడు అన్నట్లు కొందరు ఏజెంట్లు బాకా ఊదుతున్నారు…ఏజెంట్లు అలా ఉంటే ఇక అధికారి ఊరుకుంటాడా…? తాను సైతం న్యూస్ 10 లో వస్తున్న కథనాల విషయంలో తన నోటికి పనిచెప్పి ఇష్టారీతిన దుర్భాషలాడుతూ సంగతి చూస్తాం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది…ఈ అధికారి ఇలా ఉంటే మహబూబాబాద్ ఆర్టీఏ లో పనిచేసే ఓ ఎం వి ఐ అలాగే వరంగల్ రవాణా శాఖ లో పనిచేసే ఓ ఎం వి ఐ తాము చేస్తున్న అవినీతి సరైనదే అన్నట్లు న్యూస్ 10 పైనే అవాకులు చవాకులు పేలుతున్నారు… “గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు”తనకు అసలు ఏం సంబంధం లేకున్నా…వరంగల్ ఏం వి ఐ ఓ అడుగు ముందుకు వేసి తానే అపర మేధావి మిగతా వాళ్లు అందరూ ఎందుకు పనికిరారు అన్నట్లు చేసే అవినీతి లోను తన బిల్డప్ కనబర్చుతున్నట్లు తెలిసింది…జర్నలిస్టులు ప్రశ్నిస్తే వారిని ఎలా నిలువరించాలి…?మాట్లాడుదాం ,వివరణ ఇస్తాం అని పిలిచి ఇలా అవమానించాలి…? వారిపై లేనివి కల్పించి ఎలా గోల చేయాలో..? ఈ అధికారికి వెన్నతో పెట్టిన విద్యట…ఇలాగే ఈ అధికారి వరంగల్ రవాణా శాఖ కార్యాలయంలో పనిచేసిన ఔట్ సోర్సింగ్ లో పనిచేసిన ఓ వాచ్ మెన్ తాను రిక్రూట్ అయిన ఓ ఏజెన్సీ తో పొసగక తన ఉద్యోగం మాని ఏజెంట్ గా మారితే ..తాము వసూళ్లకు పెట్టుకున్న ఏజెంట్లకు పైల్స్ రావడం లేదు అవినీతి తో వచ్చే సొమ్ము మొత్తానికి గండి పడుతుందని అతన్ని నానా తిప్పలు పెట్టీ బలవంతంగా అక్కడనుంచి పంపించినట్లు విశ్వసనీయ సమాచారం…ఇదిలాఉంటే న్యూస్ 10 లో వరుస కథనాల నేపద్యంలో ఏజెంట్లు అందరూ అప్రమత్తంగా ఉండండి… గుట్టుచప్పుడు కాకుండా వసూళ్లు చేయండి…న్యూస్ 10 వాళ్ల నిఘా ఉందని ఆ రెండు జిల్లాల రవాణా శాఖ అధికారి ఏజెంట్లకు ఫోన్ చేసి సూచనలు చేసినట్లు తెలియవచ్చింది…దందా నడపండి సొమ్ము మాకు అప్పగించండి కానీ కాస్త జాగ్రత్త అంటూ వారికి సలహా ఇచ్చాడట ఆ అధికారి…మరోవైపు న్యూస్ 10 లో కథనాలు వస్తున్నాయి ఎలా …?అంటూ ఆర్టీఏ అధికారులకు మధ్యవర్తులుగా ఉన్న ఏజెంట్లు,ఇతర ఏజెంట్లు మంగళవారం ఓ రహస్య సమావేశానికి సిద్ధపడినట్లు పక్కా సమాచారం…
అక్రమ వసూళ్లు హక్కా…?
రవాణా శాఖ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వాహనదారుల నుండి అక్రమంగా వసూలు చేయడం వారి యొక్క హక్కు అన్నట్లు అధికారులు,వారి మధ్యవర్తి ఏజెంట్లు వ్యవహరిస్తున్నారు. వసూళ్ల అవినీతి అక్రమాలపై ఎన్ని కథనాలు వచ్చినా దందా మాత్రం ఆపేదే లేదు,’బరాబర్ వసూలు చేస్తాం’ అన్నట్లే అధికారులు అక్రమాలకు పాల్పడుతునే ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి…గత వారం రోజులుగా న్యూస్ 10 మానుకోట రవాణా శాఖలో జరుగుతున్న అక్రమాలను వెలికి తీసి అందులో అధికారుల,ఏజెంట్ల పాత్ర పై వరుస కథనాలు ప్రచురిస్తున్న విషయం తెలిసిందే.. రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే ఏ ఒక్క వాహనదారుడు కూడా స్వతహాగా ఏజెంట్ల మధ్యవర్తిత్వం లేకుండా అధికారులతో పని పూర్తి చేసుకున్న దాఖలాలు లేవంటే ఇక్కడ అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో రాజ్యమేలుతున్నాయో వాహనదారులు ఏ మేరకు నిలువు దోపిడీకి గురవుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు…
పెద్ద సారుకే అంతా తెలుసు…?
మానుకోట రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమ వసూళ్ల తతంగం అంత ఆ పెద్ద సారు కనుసన్నల్లోనే అని ఇక్కడ గుసగుసలు గట్టిగా వినవస్తున్నాయి.మానుకోట జిల్లా రవాణా శాఖ ఇన్చార్జి అధికారిగా ఉన్న ఆ పెద్ద సారు తన కార్యాలయంలో ఏజెంట్లు ,కిందిస్థాయి అధికారుల, హోంగార్డుల ఆగడాలను అరికట్టాల్సింది పోయి వారినే వెనకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వారంలో కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే చుట్టపు చూపుగా జిల్లాలో విధులు నిర్వహించే సదరు ఉన్నతాధికారి ఇలా వచ్చి అలా రెండు మూడు గంటల్లోనే విధులు ముగించుకొని రావాల్సిన నిధులు సేకరించుకొని వెళ్తాడట. మిగతా రోజులు మొత్తం కార్యాలయంలోని ఓ ఏంవీఐ కి పనులు మొత్తం అప్పజెప్పి తన ద్వారా అన్ని వ్యవహారాలు నడిచే విధంగా ఆదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా మరో కొన్ని నెలల్లో రిటైర్మెంట్ కానున్న సదరు ఇన్చార్జి ఉన్నతాధికారి రవాణా శాఖలో తనకు ఉన్నత స్థాయి కల్పిస్తూ ప్రమోషన్ వచ్చిన అక్రమ ఆదాయం ఎక్కడ పోతుందో అని దాన్ని కూడా వదులుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదలా ఉండగా ఆధారాలతో సహా అక్రమ వసూళ్ల తతంగాన్ని బయటపెట్టి వరుస కథనాలు ప్రచురిస్తూ నిలువు దోపిడీకి గురవుతున్న వాహనదారుల పక్షాన నిలుస్తున్న న్యూస్ 10 పత్రిక ప్రతినిధులపై తన సన్నిహితుల వద్ద అవాకులు చవాకులు పేలుతూ చేసేదేమీ లేక తన నోటికి పని చెబుతూ న్యూస్ 10 జర్నలిస్టులపై సదరు అధికారి ఎక్కడలేని దుష్ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రజల పక్షాన వకల్తా పుచ్చుకొని అధికారుల అక్రమాలను అవినీతిని వెలికితీస్తున్న న్యూస్ 10 వారి తాటాకు చప్పుళ్లకు, వారు ప్రదర్శించే మేకపోతు గాంభీర్యానికి వెనుకడుగు వేయదని మరోసారి గుర్తుచేస్తున్నాం… విధినిర్వహణలో అనేక అక్రమాలకు పాల్పడుతున్న వారే అదేదో వారి హక్కు అయినట్లు, సమాజ హితం కోసం పనిచేస్తున్న పత్రికపై ,జర్నలిస్టులపై నోరు పారేసుకోవడం ఆ అధికారుల విజ్ఞతకే వదిలేస్తున్నాం.ఏది ఏమైనా మానుకోట,వరంగల్ రవాణా శాఖలో జరుగుతున్న వసూళ్ల తతంగాన్ని న్యూస్10 ఇంకా వెలుగులోకి తెస్తుంది…నిఘా వేసి అవినీతి భరతం పడుతుంది…



