రైతులపై సీఎం వ్యాఖ్యలకు వినూత్న నిరసన
రక్తం ప్యాకెట్లతో సీఎం నివాసానికి వెళ్లేందుకు యత్నం
తెలంగాణ భవన్ చుట్టూ భారీగా పోలీసుల మోహరింపు
బీఆర్ఎస్వీ నాయకులను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) నాయకులు వినూత్న నిరసనకు దిగారు. బ్లడ్ డొనేట్ చేసి సేకరించిన రక్తం ప్యాకెట్లతో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
‘‘రైతులను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది’’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్వీ నాయకులు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. రైతులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆరోపిస్తూ, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
నిరసనలో భాగంగా బీఆర్ఎస్వీ నాయకులు రక్తదానం చేసి సేకరించిన బ్లడ్ ప్యాకెట్లను తీసుకుని సీఎం నివాసానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సీఎం చేసిన వ్యాఖ్యలకు ప్రతీకాత్మకంగానే రక్తం ప్యాకెట్లతో నిరసన తెలుపుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
బీఆర్ఎస్వీ ఆందోళన నేపథ్యంలో తెలంగాణ భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సీఎం నివాసం వైపు వెళ్లకుండా బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నట్లు సమాచారం.పోలీసుల ఆంక్షలను దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్వీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో తరలించారు. దీంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.రైతుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. రైతులను అవమానించే విధంగా మాట్లాడితే రాష్ట్రవ్యాప్తంగా మరింత తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.



