వరంగల్ పోచమ్మ మైదాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కార్యాలయంలో ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న ఓ అధికారి ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లను అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పని కోసం ప్రత్యేక రేట్లు నిర్ణయించి, మధ్యవర్తుల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సాధారణ ప్రజలు నిబంధనల ప్రకారం కార్యాలయానికి వెళ్లి పని చేయించుకోవాలంటే రోజులు పడుతుండగా, ఏజెంట్ల ద్వారా వెళ్తే మాత్రం గంటల్లో పనులు పూర్తవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లకు కార్యాలయంలో రెడ్ కార్పెట్ పరుస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలో అధికారుల కంటే మధ్యవర్తులకే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా, రాజకీయ నాయకుల సిఫార్సులు ఉంటే ఏ పని అయినా నిబంధనలు పక్కనపెట్టి పూర్తి చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివాదాస్పద వ్యవహారాల్లో కూడా రాజకీయ ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల ఓ వృద్ధురాలికి ఇష్టం లేకపోయినా ఆమె ఇంటికి వెళ్లి బలవంతంగా రిజిస్ట్రేషన్ నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదం ఉన్నప్పటికీ, సరైన ధృవీకరణ లేకుండానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై స్థానికులు, బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ మాత్రమే అయినప్పటికీ, కార్యాలయం మొత్తం ఆయన చేతుల్లోనే నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారికంగా పూర్తి బాధ్యతలు లేకపోయినా, అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు అధికారుల మద్దతుతోనే ఈ వ్యవహారాలు కొనసాగుతున్నాయన్న చర్చ కార్యాలయ వర్గాల్లో జరుగుతోంది.కార్యాలయంలో జరుగుతున్న ఈ అక్రమాలపై ఇప్పటికే పలుమార్లు మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ, ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై సమగ్ర విచారణ చేపడితే మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.


