నాయిని రాజేందర్ రెడ్డి ఖబర్దార్..!

బీఆర్ఎస్ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం: కంజర్ల మనోజ్ కుమార్

పేద విద్యార్థులకు సహాయం చేస్తే ఎందుకు కడుపుమంట అని ఎమ్మెల్యేను ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత

  • నియోజకవర్గ అభివృద్ధిని వదిలేసి విమర్శలకే పరిమితమవుతున్నారని ఆరోపణ
  • దాస్యం వినయ్ భాస్కర్, దుగ్గంపూడి రంజిత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్ నాయకులు

హనుమకొండ: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు దాస్యం వినయ్ భాస్కర్, దుగ్గంపూడి రంజిత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ 4వ డివిజన్ అధ్యక్షుడు కంజర్ల మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం మానుకుని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.

పేద విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యా సహాయం అందిస్తున్న నాయకులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. దుగ్గంపూడి రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా 11 వేల స్కూల్ బ్యాగులు, సుమారు 600 మంది పేద విద్యార్థులకు స్కూల్ ఫీజుల చెక్కులను అందజేసిన కార్యక్రమంపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. “పేద విద్యార్థులను చదివిస్తే ఎందుకు అంత కడుపుమంట? మీకు దమ్ముంటే మీరు కూడా వంద మంది విద్యార్థులను చదివించండి” అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.

నాయిని రాజేందర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కనీసం ఒక పెన్సిల్ అయినా అందించారా అని ప్రశ్నించారు.

దాస్యం వినయ్ భాస్కర్, దుగ్గంపూడి రంజిత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీష్ రావు జిల్లాకు వచ్చిన సమయంలో ఫ్లెక్సీలను తొలగించడం, బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసు కేసులు నమోదు చేయించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని ఆరోపించారు.

భద్రకాళి మాడవీధుల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎక్కువకాలం సాగవని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ అధ్యక్షుడు ప్రసాద్, సాదంత్, 8వ డివిజన్ అధ్యక్షుడు పానుగంటి శ్రీధర్, 50వ డివిజన్ అధ్యక్షుడు వీపీ రెడ్డి, 51వ డివిజన్ అధ్యక్షుడు ఫిరోజ్, సందీప్ యాదవ్, గండ్రకోట రాకేష్, శ్రీకాంత్, స్నేహిత్, జావిద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here