బండి సంజయ్ కొడుకు పోక్సో కేసుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు…

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ… ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణను కుట్రగా చిత్రీకరించడం కంటే… ఆరోపణలపై నిజానిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
“కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ గారే ముందుగా తన కుమారుడిపై పారదర్శక విచారణ జరపాలని కోరాలి. కుట్ర జరుగుతోందని చెప్పడం కంటే… బాధితురాలు మిమ్మల్ని కలిసిందా లేదా అన్న విషయాన్ని మీరు నిరూపించుకోవాలి” అని పొన్నం వ్యాఖ్యానించారు.
ఈ కేసును కుల రాజకీయాల వైపు మళ్లించే ప్రయత్నాలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. “కొంతమంది మున్నూరు కాపు నాయకులు కుట్ర జరుగుతోందంటున్నారు. కానీ బాధితురాలు కూడా మున్నూరు కాపు వర్గానికి చెందిన అమ్మాయే. అలాంటప్పుడు కుల వివక్ష అంటూ మాట్లాడటం సమంజసం కాదు” అని మంత్రి పేర్కొన్నారు.
“బండి సంజయ్ వేరే పార్టీ నాయకుడు కాబట్టి ఆయనపై వివక్ష ఉండదు. అదే విధంగా కేంద్ర మంత్రి అన్న కారణంతో విచారణ పక్కదారి పట్టే అవకాశం కూడా లేదు. చట్టం ముందు అందరూ సమానమే” అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
అదేవిధంగా “కుల పెద్దమనుషులు పంచాయితీ చేసి ఇద్దరికి పెళ్లి చేస్తారా…? లేక ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారా…? అది వారి విషయం. కానీ కులం పేరుతో ఈ అంశాన్ని మళ్లించడం మాత్రం సరికాదు” అని వ్యాఖ్యానించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా… ఈ కేసు విచారణ ఏ దిశగా సాగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here