భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన అగ్రనేత
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. భార్యతో కలిసి ఆయన మంగళవారం అధికారుల ఎదుట సరెండర్ అయినట్లు సమాచారం. నరహరి లొంగుబాటు మావోయిస్టు పార్టీలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.

1996లో అజ్ఞాతంలోకి వెళ్లిన నరహరి, దాదాపు మూడు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. టెక్నికల్ వింగ్, మిలిటరీ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన ఆయన ఇటీవలే కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. ముఖ్యంగా జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం.
ఇటీవల జార్ఖండ్లో పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్ర కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో తప్పించుకునే పరిస్థితులు లేకపోవడంతోనే నరహరి పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్చి 31, 2026 గడువు లోపు “మావోయిస్టు రహిత భారత్” లక్ష్యంతో భద్రతా బలగాలు దేశవ్యాప్తంగా మావోయిస్టులపై ఆపరేషన్లు ముమ్మరం చేశాయి. ఇప్పటికే గణపతి, తిప్పరి తిరుపతి దేవుజీ వంటి పలువురు అగ్రనేతలు లొంగిపోగా… తాజాగా నరహరి సరెండర్ మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
దాదాపు 45 ఏళ్లుగా అజ్ఞాత జీవితం గడిపిన నరహరి… మావోయిస్టు ఉద్యమంలో కీలక నాయకుడిగా ఎదిగారు. తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం, కేంద్ర కమిటీలో కీలక స్థానం దక్కించుకోవడం వల్ల ఆయనకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి.
నరహరి లొంగుబాటుతో తెలంగాణ, జార్ఖండ్ ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



