కమలాపూర్ లో వైన్ షాపుల దందా

వైన్ షాపుల దందా…?

నిద్ర మత్తులో ఎక్సైజ్ శాఖ అధికారులు

గ్రామాల వారీగా పంచుకున్న ఆరు వైన్స్ షాపులు..

బెల్ట్ షాపులకు అధిక ధరలకు సరఫరా

ప్రభుత్వ ఆదాయానికి గండి… అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో వైన్ షాపుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మండలంలో మొత్తం ఆరు వైన్ షాపులు ఉండగా, ఆయా షాపుల యాజమాన్యాలు గ్రామాలను పరస్పరం పంచుకొని బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ వ్యవహారాలపై సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

గ్రామాల వారీగా మద్యం మాఫియా పట్టు..?

మండలంలోని గ్రామాలను ఆరు వైన్ షాపులు పరస్పరం పంచుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని బెల్ట్ షాపులకు ప్రభుత్వ ధరల కంటే అధికంగా మద్యం సరఫరా చేస్తూ అక్రమంగా లాభాలు పొందుతున్నారని చెబుతున్నారు. బెల్ట్ షాపులకు సరఫరా చేసే సమయంలో ఒక్కో క్వార్టర్‌పై రూ.15 వరకు, ఫుల్ బాటిల్‌పై రూ.60 వరకు, బీర్‌పై ఎమ్మార్పీ ధర కంటే రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం.

పక్క మండలాల నుంచి తెచ్చుకుంటే బెదిరింపులు..

బెల్ట్ షాప్ యజమానులు అధిక ధరల కారణంగా పక్క మండలాలకు వెళ్లి ఎమ్మార్పీ ధరలకు మద్యం తెచ్చుకునే ప్రయత్నం చేస్తే, వైన్ షాప్ యాజమాన్యాలు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి పోలీసుల తరహాలో దాడులకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెల్ట్ షాపుల్లో నిల్వ ఉంచిన ముద్రణలేని మద్యాన్ని స్వాధీనం చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు.

బెల్ట్ షాపుల్లో మరింత దోపిడి..

వైన్ షాపుల వద్ద అధిక ధరలకు మద్యం కొనుగోలు చేసిన బెల్ట్ షాపులు వినియోగదారులపై మరింత భారాన్ని మోపుతున్నాయి. ఒక్కో క్వార్టర్‌పై ఎమ్మార్పీ ధర కంటే రూ.30 వరకు, బీర్‌పై రూ.40 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
వైన్ షాపు యాజమాన్యాలు అక్రమార్జనకు పాల్పడుతూ బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా విక్రయాలు జరగాల్సిన మద్యం అనధికార మార్గాల్లో విక్రయించబడటం, బెల్ట్ షాపుల ద్వారా భారీగా అక్రమ లావాదేవీలు జరగడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం?

మండలంలో ఇంత బహిరంగంగా అక్రమ విక్రయాలు జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైన్ షాపు యాజమాన్యాల అక్రమార్జనపై సమాచారం ఉన్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో అధికారుల పనితీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది.

వెంటనే చర్యలు తీసుకోవాలి…

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వైన్ షాపులపై దాడులు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ బెల్ట్ షాపులపై కూడా కఠిన చర్యలు తీసుకొని ప్రజలను దోపిడీ నుంచి కాపాడాలని కోరుతున్నారు.
కమలాపూర్ మండలంలో మద్యం మాఫియా పట్టు రోజురోజుకు బలపడుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఇప్పటికైనా నిద్రలేచి చర్యలు తీసుకుంటుందా… లేకపోతే ప్రజల ఆగ్రహం మరింత ఉధృతమవుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here