ఆయన చెప్తారు… వీళ్లు వసూళ్లు చేస్తారు..?

ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ కను సన్నల్లో ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ల హవా..?

పోచమ్మ మైదాన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పని కావాలంటే పైసలేనా..?

“ఏ పనికి ఎంత” అంటూ రేట్లు ఫిక్స్ చేస్తున్నారన్న ఆరోపణలు

సాయంత్రం కాగానే కార్యాలయం సమీపంలో పంపకాల దందా..?

వరంగల్ పోచమ్మ మైదాన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ అవినీతి ఆరోపణలు రోజురోజుకీ తీవ్ర స్థాయికి చేరుతున్నాయన్న చర్చ సాగుతోంది. రిజిస్ట్రేషన్ పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజల నుంచి అధికారిక ఫీజులకు మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తూ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

“ఏ పనికి ఎంత” అంటూ రేట్ల రాజ్యం..?

రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతి పనికి ఓ ప్రత్యేక రేటు ఉందన్న ప్రచారం స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణ రిజిస్ట్రేషన్‌, మార్కెట్ విలువ మార్పులు, డాక్యుమెంట్ క్లియరెన్స్‌, అత్యవసర ఫైల్ ప్రాసెసింగ్‌… ఇలా ప్రతి దశలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

“ఏ పని ఎంతలో అవుతుంది..?” అనే లెక్కలు ముందుగానే ఫిక్స్ అవుతున్నాయని, పని త్వరగా కావాలంటే అదనపు చెల్లింపులు తప్పవని బాధితులు చెబుతున్నట్లు సమాచారం.

ఇంచార్జ్ అధికారి కనుసన్నల్లోనే వ్యవహారమా..?

కార్యాలయంలో కొందరు డాక్యుమెంట్ రైటర్లు ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్‌కు అత్యంత సన్నిహితులుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రజల నుంచి వసూలు చేసే డబ్బులు నేరుగా అధికారుల వరకు చేరుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

“ఆయన చెప్తారు… వీళ్లు వసూళ్లు చేస్తారు” అనే విమర్శలు కార్యాలయం చుట్టూ గట్టిగా వినిపిస్తున్నాయి. ఫైల్ ఎప్పుడు కదలాలి, ఎవరి పని ముందుగా చేయాలి, ఎవరిని ఆపాలి అన్న విషయాల్లో కూడా డాక్యుమెంట్ రైటర్లదే పెత్తనం నడుస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

డబ్బులు ఇవ్వకుంటే డాక్యుమెంట్ చేతికి రాదా..?

అన్ని ప్రక్రియలు పూర్తయి డాక్యుమెంట్ సిద్ధంగా ఉన్నా… “అడిగింది” ఇవ్వకుంటే రిజిస్ట్రేషన్ పత్రాలు చేతికి అందవన్న ఆరోపణలు మరింత సంచలనం రేపుతున్నాయి. చిన్న చిన్న అభ్యంతరాలు చెబుతూ ఫైళ్లను పెండింగ్‌లో పెట్టడం, పలుమార్లు కార్యాలయం చుట్టూ తిప్పించడం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నట్లు సమాచారం.

సాయంత్రం కాగానే పంపకాల దందా..?

కార్యాలయం సమీపంలోనే సాయంత్రం వేళ “పంపకాల వ్యవహారం” జరుగుతోందన్న ప్రచారం కూడా స్థానికంగా చర్చనీయాంశమైంది. రోజంతా వసూలైన మొత్తాలను కొందరు మధ్యవర్తులు సేకరించి పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పలు వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏసీబీ దాడులు జరిగినా మారని పరిస్థితులు..?

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుస దాడులు నిర్వహిస్తున్నా… పోచమ్మ మైదాన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం పరిస్థితుల్లో మార్పు లేదని స్థానికులు అంటున్నారు. అవినీతి ఆరోపణలు పదేపదే వస్తున్నా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

విచారణ జరపాలన్న డిమాండ్

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here