వరంగల్ కమిషనరేట్‌లో ఎస్ఐల భారీ బదిలీలు.. 23 మందికి కొత్త పోస్టింగ్‌లు
తొమ్మిది మంది మహిళా ఎస్ఐలకు స్థానచలనం
పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక విభాగాల్లో పునర్వ్యవస్థీకరణకు కమిషనర్ ఉత్తర్వులు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 23 మంది సబ్ ఇన్స్పెక్టర్లను (ఎస్ఐలు) వివిధ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక విభాగాలకు బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాల రీత్యా తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది మహిళా ఎస్ఐలు ఉండటం విశేషం.
బదిలీ జాబితాలో సి.సి.ఆర్.బీ, సి.పీ.టి.సీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐటీ సెల్, భరోసా సెంటర్, ట్రాఫిక్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు కూడా ఉన్నారు. పలువురు ఎస్ఐలను సుబేదారి, కాజీపేట, హనుమకొండ, మిల్స్ కాలనీ, ఇంతేజార్గంజ్, పరకాల, నర్సంపేట, గీసుగొండ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు.
మహిళా ఎస్ఐలలో ఎస్.మౌనికను డబ్ల్యూపీఎస్-2 సుబేదారి నుంచి కాజీపేట పోలీస్ స్టేషన్‌కు, తౌటం శ్రావణిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కేయూసీ పోలీస్ స్టేషన్‌కు, డి.నిహారికను మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు, వి.భవానిని ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్‌కు, ఎన్.సాయి దివ్యను హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు, కె.లక్ష్మిని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
అలాగే హనుమకొండ ట్రాఫిక్ పీఎస్‌లో పనిచేస్తున్న ఎల్.కొమురెల్లిని సెంట్రల్ బ్రాంచ్ (సీఎస్బీ)కి, ఇంతేజార్గంజ్ పీఎస్‌లోని ఎన్.రవికిరణ్, సుబేదారి పీఎస్‌లోని ఎస్.వెంకన్నలను కూడా సీఎస్‌బీకి బదిలీ చేశారు. టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న బి.చందర్‌ను సీసీఎస్‌కు, పరకాల పీఎస్‌లోని ఎం.రమేష్, మిల్స్ కాలనీ పీఎస్‌లోని ఎల్.నరేష్‌లను సీసీఆర్బీకి బదిలీ చేశారు.
ఇనవోలు ఎస్‌హెచ్‌వోగా పనిచేస్తున్న పి.శ్రీనివాస్‌ను పీసీఆర్ విభాగానికి బదిలీ చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అటాచ్ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త విధుల్లో చేరాలని కమిషనర్ ఆదేశించారు.



