వైఎస్సార్ నగర్ గుడిసెలను తొలగించొద్దు

కలెక్టర్‌కు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు

గుడిసెవాసులకు ఇక్కడే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని డిమాండ్


కాజీపేటలోని వైఎస్సార్ నగర్ గుడిసెవాసులను ఖాళీ చేయించే ప్రయత్నాలను నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. గుడిసెలు తొలగించే చర్యల వెనుక భారీ భూ వ్యవహారాలు ఉన్నాయని ఆరోపిస్తూ, అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్, సుంచు కృష్ణ, మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగరావు మాట్లాడుతూ, వైఎస్సార్ నగర్ భూములపై అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతల కన్ను పడిందని ఆరోపించారు. గుడిసెవాసులను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని, ఈ వ్యవహారంలో స్థానిక మాజీ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ పేరును ప్రస్తావిస్తూ పలు ఆరోపణలు చేశారు..గుడిసెవాసులను ఖాళీ చేయించే బదులు, అదే ప్రాంతంలో వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మిగిలిన స్థలంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏసీపీ కార్యాలయం, ఐటీఐ, ఎమ్మార్వో కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయ సముదాయాలను నిర్మించాలని కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.పేదల నివాస హక్కులను కాపాడాలని, గుడిసెవాసులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎలాంటి బలవంతపు ఖాళీ చర్యలు చేపట్టవద్దని వారు కోరారు. ఈ అంశంపై జిల్లా యంత్రాంగం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్, ఎండీ అఫ్జల్ పాషా, పాలడుగుల శివకుమార్, బెదరకోట రంజిత్, పాము రాజేష్, తండమల్ల వేణు, నీరటి పావని, గబ్బెట కరుణ్ (సిద్దు), మంద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here