రుద్రమాంబ మిల్లుకు టాస్క్ పోర్స్

న్యూస్10 కథనాల నేపథ్యంలో రంగంలోకి దిగిన స్టేట్ టాస్క్ ఫోర్స్

హన్మకొండ జిల్లాలో సంచలనం రేపుతున్న ముప్పై వేల ధాన్యం బస్తాల మాయం వ్యవహారం రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై న్యూస్10 వరుస కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించినట్లు సమాచారం. కోట్ల రూపాయల విలువైన ధాన్యం బస్తాల గల్లంతు వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందం రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ధాన్యం నిల్వలు, రవాణా, మిల్లింగ్ ప్రక్రియతో పాటు సంబంధిత పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.ఈ వ్యవహారంలో కీలకంగా భావిస్తున్న మడికొండ రాంపూర్ ప్రాంతంలోని రుద్రమాంబ రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ ప్రత్యేక దృష్టి సారించింది. మిల్లుకు వచ్చిన ధాన్యం, అక్కడ నిల్వ చేసిన స్టాక్, మిల్లింగ్‌కు సంబంధించిన రికార్డులు, రవాణా పత్రాలు, స్టాక్ రిజిస్టర్లు తదితర వివరాలను పరిశీలించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.ధాన్యం బస్తాల సంఖ్యకు సంబంధించిన రికార్డులు, వాస్తవ నిల్వల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్లింది, ఎప్పుడు తరలించారు అనే అంశాలపై పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతోంది.

టాస్క్ ఫోర్స్ తనిఖీలకు ససేమిరా అంటున్న మిల్లర్?

టాస్క్ ఫోర్స్ తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సంబంధిత మిల్లర్ వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల తనిఖీలకు సహకరించడంలో నిరాసక్తత చూపుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. పత్రాల పరిశీలన, స్టాక్ తనిఖీల విషయంలో వివిధ కారణాలు చూపిస్తూ ఆలస్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోయినా, టాస్క్ ఫోర్స్ బృందం మిల్లులోకి ప్రవేశించి తనిఖీలు నిర్వహించకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం స్థానికంగా చర్చనీయాంశమైంది.

పూర్తి స్థాయి తనిఖీలకు సిద్ధమవుతున్న అధికారులు

మరోవైపు టాస్క్ ఫోర్స్ అధికారులు మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేదని తెలుస్తోంది. అవసరమైతే అన్ని సంబంధిత శాఖల సహకారంతో పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ధాన్యం నిల్వలు, కొనుగోలు వివరాలు, రవాణా మార్గాలు, ప్రభుత్వ రికార్డులు, మిల్లింగ్ లెక్కలు అన్నింటినీ సమన్వయం చేసి పరిశీలించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.విచారణలో భాగంగా సంబంధిత అధికారుల పాత్ర, రికార్డుల నిర్వహణ, ధాన్యం బస్తాల తరలింపు ప్రక్రియలో జరిగిన పరిణామాలపై కూడా ఆరా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.

బయటపడనున్న అసలు నిజాలు?

ముప్పై వేల ధాన్యం బస్తాల మాయం వ్యవహారం క్రమంగా కీలక మలుపు తిరుగుతోంది. స్టేట్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగడంతో ఇప్పటివరకు బయటకు రాని అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ధాన్యం బస్తాల గల్లంతుకు బాధ్యులు ఎవరు? అధికార యంత్రాంగంలో ఎవరెవరి పాత్ర ఉంది? రికార్డుల్లో ఏవైనా అక్రమాలు జరిగాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం కనిపిస్తోంది.

న్యూస్10 కథనాల నేపథ్యంలో ప్రారంభమైన ఈ పరిణామాలు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ తనిఖీల అనంతరం వెలువడే నివేదికపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here