బొగ్గు లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి మృతి…

రోడ్డు తనిఖీలు చేస్తుండగా ఘోర ప్రమాదం..
బొగ్గు టిప్పర్ ఢీకొని డీటీవో వెంకన్న దుర్మరణం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. పరకాల-భూపాలపల్లి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న రవాణా శాఖ అధికారులపైకి అదుపుతప్పిన బొగ్గు టిప్పర్ దూసుకురావడంతో జిల్లా రవాణా అధికారి (DTO) వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం మేరకు, భూపాలపల్లి డీటీవో కార్యాలయం సమీపంలో వెంకన్న సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ అకస్మాత్తుగా అధికారుల వైపు దూసుకురావడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టిప్పర్ ఢీకొన్న ప్రభావానికి వెంకన్న మృతదేహం నుజ్జునుజ్జయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

కాగా, వెంకన్న కేవలం 15 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లి జిల్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఆయన మృతిచెందడం రవాణా శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వెంకన్న మృతిపై సహచర ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

బొగ్గు లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి మృతి...- news10.app
మృతి చెందిన డి టి ఓ వెంకన్న

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here