‘దిడ్డి’కి దక్కడం డౌటే…?

ఆసియాలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ ఐయిన ఏనుమాముల మార్కెట్ చైర్మెన్ పదవికోసం ఎవరిప్రయత్నాలు వారు చేస్తున్నారు. వీరిలో ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో 34 డివిజన్ కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి ఛైర్మెన్ పదవికోసం విశ్వప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే దిడ్డి కుమారస్వామి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఓ దశలో అధిష్టానం సైతం ఛైర్మెన్ విషయంలో పూర్తి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది గులాబీ నేతలైతే ఛైర్మెన్ పదవి ఖాయం ఐయిందని త్వరలో దిడ్డి పేరు ప్రకటిస్తారని ప్రచారం చేస్తున్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే పట్టుబట్టి మార్కెట్ ఛైర్మెన్ పదవి దిడ్డికి ఇప్పిస్తున్నారని గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

'దిడ్డి'కి దక్కడం డౌటే...?- news10.app

పట్టుబట్టిన మరో ఎమ్మెల్యే…?

వరంగల్ ఏనుమాముల మార్కెట్ తన నియోజకవర్గ పరిధిలో ఉంది కనుక ఈసారి మార్కెట్ ఛైర్మెన్ తనవారికే ఇవ్వాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే పట్టుబట్టినట్లు తెలిసింది. గత రెండు పర్యాయాలు పరకాల నియోజకవర్గ నాయకునికి ఛైర్మెన్ పదవి ఇవ్వగా కనీసం ఈసారయిన వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన నాయకునికి ఇవ్వాలని ఎమ్మెల్యే అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఈ ఎమ్మెల్యే నుంచి వ్యతిరేకత ఉన్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే మాత్రం దిడ్డికి ఛైర్మెన్ పదవి వచ్చేలా చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఒకే వ్యక్తికి రెండు ఆఫర్ లా…?

మరివైపు కార్పొరేటర్ గా ఉన్న దిడ్డి కుమారస్వామికి ఏనుమాముల మార్కెట్ పదవి కట్టబెట్టేందుకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ప్రయత్నం చేయడం పట్ల గులాబీ శ్రేణుల్లో అసంతృప్తి రగులుతోంది… కార్పొరేటర్ గా కొనసాగుతున్న వ్యక్తికి కావాలని మార్కెట్ ఛైర్మన్ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేయడం ఎందుకని… టీఆర్ఎస్ లో ఆ పదవికి అర్హులయిన వారు ఇంకా ఎవరు లేరా అని వారు ప్రశ్నిస్తున్నారు.. తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొని తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికి నామినేటెడ్ పదవులు రాని వారు ఇంకా వేచి చూస్తున్న వారు చాలా మందే ఉన్న దిడ్డి కుమారస్వామి కే ఛైర్మెన్ పదవి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుండడం పట్ల టీఆర్ఎస్ లోని ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. దిడ్డి కుమారస్వామి కి ఛైర్మెన్ పదవి ఇస్తే తూర్పు గులాబీలో అసంతృప్తులు బాగానే బయటపడే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించి అక్కడ మరోసారి ఎన్నిక వచ్చేలా చేసి దిడ్డికి ఛైర్మెన్ పదవి ఇప్పించాల్సిన అవసరం ఏముందని ఉద్యమకారులు అంటున్నారు. ఇదిలావుండగా ఓ అధికారి అవినీతి విషయంలో దిడ్డి కుమారస్వామి పై గతంలో ఆరోపణలు రాగా ఇది గమనించిన అధిష్టానం చివరి నిమిషంలో చైర్మన్ పదవి ఇచ్చేందుకు నో చెప్పినట్లు తెలిసింది… ఈ అధికారి అవినీతి దిడ్డికి పదవిరాకుండా అడ్డుగా మారినట్లు తెలిసింది. మొత్తానికి ఎంతగా ప్రయత్నం చేసినా దిడ్డికి అసలు ఛైర్మెన్ పదవి దక్కేనా…? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఈ ఛైర్మెన్ పదవిని అధిష్టానం ఎవరికి కేటాయిస్తుందో చూడాలి.