కమిషనర్ సార్…. ఈ గోడు వింటారా….?

  • కానిస్టేబుల్ భార్య వేడుకోలు
  • భర్త చనిపోయి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికి బెనిఫిట్స్ అందని కానిస్టేబుల్ భార్య
  • కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరిగిన నేటికి కనికరించని అధికారులు
  • ఉద్యోగం, బెనిఫిట్స్ తమకే కావాలని అత్తింటి వారి వేధింపులు?
  • నామిని ఉన్న కానిస్టేబుల్ భార్యను కాదని అత్తింటి వారికే కొందరు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణ
  • కమిషనర్ ను కలిసి గోడు చెప్పుకుందామంటే కలవకుండా చేస్తున్న ఓ సంఘం నేతలు?
  • కమిషనర్ సార్ కాస్త కనికరించి తన గోడు వినాలని కానిస్టేబుల్ భార్య విన్నపం

ఆమె ఓ కానిస్టేబుల్ భార్య… ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తమ కూతురు జీవితం సాఫీగా కొనసాగుతుందని అందరిలాగే భావించి తల్లిదండ్రులు ఆమెకు కానిస్టేబుల్ తో వివాహం జరిపించారు… ఇంతలోనే విధి వక్రీకరించింది. అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి చెందాడు తమ బిడ్డ జీవితం ఆగం ఐయిందని అల్లుడు చనిపోవడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు… ప్రభుత్వం నుండి అందే సాయం,డిపెండెంట్ ఉద్యోగం తో తమ కూతురు కాస్త కుదుట పడుతుంది అనుకున్నారు… కానీ కానిస్టేబుల్ మరణించి ఇప్పటి వరకు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వ బెనిఫిట్స్ కానీ డిపెండెంట్ ఉద్యోగం కానీ ఆ కానిస్టేబుల్ భార్యకు అందలేదు. అంతేకాదు కనీసం తన గోడు వెళ్లబోసుకునేందుకు పోలీస్ కమిషనర్ కలిసే అవకాశం కూడా రాలేదు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన సౌజన్యకు హన్మకొండకు చెందిన కొలగాని రజినీకాంత్, పిసి నెంబర్ 1134 తో 2013 లో వివాహం జరిగింది.

కమిషనర్ సార్.... ఈ గోడు వింటారా....?- news10.app

వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలకు 2017 లో రజినీకాంత్ అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నామినిగా ఉన్న సౌజన్యకు బెనిఫిట్స్, డిపెండెంట్ ఉద్యోగం రావాలి… కానీ మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఆ దిశగా కనీసం అడుగు కూడా పడలేదు… సరికదా దగ్గరుండి పెళ్లి జరిపించిన అత్తమామలు, తన భర్త తరపు వారు నువ్వసలు కానిస్టేబుల్ భార్య వె కాదనే కొత్త వాదన తీసుకొచ్చారు…. బెనిఫిట్స్ ఏవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ సఫలీకృతులవుతు వస్తున్నారు… అత్తింటివారికి కమిషనర్ కార్యాలయంలోనే కొందరి అండ ఉందని , పోలీస్ సంఘం సైతం వారికే అనుకూలంగా వ్యవహరిస్తుందని కానిస్టేబుల్ భార్య ఆరోపిస్తోంది… తన భర్త ఉద్యగ సర్వీస్ బుక్ లో, ఆరోగ్య భద్రత కార్డులో, పోలీస్ సంక్షేమ సంఘం సభ్యత్వం లో నామినిగా తన పేరు ఉండగా తనకు రావాల్సిన బెనిఫిట్స్, డిపెండెంట్ ఉద్యోగం రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమె ప్రశ్నిస్తుంది. తన మరిదికి డిపెండెంట్ ఉద్యోగం ఇవ్వాలని అత్తింటి వారు డిమాండ్ చేశారని తాను కాదు అనేసరికి తనను కానిస్టేబుల్ రజినీకాంత్ భార్యనే కాదంటున్నారని సౌజన్య కన్నీటి పర్యంతమయ్యారు.

అడ్డుకుంటున్నదేవరు…?

భర్త పోయిన పుట్టెడు దుఃఖం లో ఉన్న తనకు సాయం చేసి న్యాయంగా రావాల్సిన బెనిఫిట్స్ ను తనకు వచ్చేలా చూడాల్సిన కమిషనరేట్ లోని కొందరు ఉద్యోగులు, కొందరు పోలీస్ సంఘం నాయకులు తన అత్తింటి వారికి సహకరిస్తూ మూడేళ్లు గడుస్తున్నా తనకు ఎలాంటి సాయం అందకుండా చేశారని సౌజన్య ఆరోపించింది. సాయం కోరి వెళితే తనను తప్పుదారి దారి పట్టించే ప్రయత్నం చేశారని… వారి పరపతిని ఉపయోగించి ఉన్నతాధికారులవరకు తన విన్నపం వెళ్లకుండా చేశారని ఆమె ఆవేదన చెందింది.

కమిషనరేట్ కార్యాలయం పరిపాలన విభాగంలోని కొందరు తనపై అనవసరంగా నోరు పారేసుకొని అసలు నువ్వెందుకు వస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కమిషనరేట్ కార్యాలయం అంటేనే భయపడేలా చేశారని సౌజన్య న్యూస్10 తో తన ఆవేదన వెలిబుచ్చింది. ఈ మూడు సంవత్సరాల కాలంలో తాను అనేకసార్లు పోలీస్ కమిషనర్ కలిసేందుకు ప్రయత్నం చేస్తే కనీసం కార్యాలయం వద్దకు కూడా వెళ్లకుండా చేశారని… కమిషనరేట్ లో నీకేం…పని అని కొందరు పోలీసు సంఘం నాయకులు తనను కమిషనర్ను కలవకుండా అడ్డుతగిలారని ఆమె తెలిపింది.

కమిషనర్ సార్… కనికరించండి

భర్త చనిపోయి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి ఎలాంటి భెనిపిట్స్ అందకుండా మనోవేదనకు గురి అవుతున్న తనకు కమిషనర్ న్యాయం చేయాలని కానిస్టేబుల్ భార్య సౌజన్య వేడుకుంటుంది… కమిషనర్ అనుమతిస్తే తనను కలిసి తన గోడు వెళ్లబోసుకుంటానని అంటోంది. ఎప్పుడు తాను కమిషనర్ ను కలిసి బాధ చెప్పుకుందామనుకుంటే తనకు కొందరు అడ్డుతగిలారని ఇప్పటికైనా కమిషనర్ సార్ తనను కనికరించి తనకు రావాల్సిన బెనిఫిట్స్, డిపెండెంట్ ఉద్యోగం అందేలా చూడాలని వేడుకుంటుంది.. మరి ఈ విషయంలో పోలీస్ కమిషనర్ ఎలా స్పందిస్తారో చూడాలి.