వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

ప్రజలందరికీ వైద్యం చేసి పాటుపడాల్సిన ఏపీ వైద్య ఆరోగ్యశాఖకే జబ్బు చేసిందన్న ఆరోపణలున్నాయి. ఏళ్లుగా అందులో పాతుకుపోయిన కొందరు అవినీతి అధికారులు ప్రజాశ్రేయస్సు మరిచి సొంత లాభం చూసుకుంటున్నారన్న విమర్శలు క్షేత్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకే ఒక్కో వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ వస్తున్న సీఎం జగన్ ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖపై పడ్డారు. ఆ శాఖలోని అవినీతిని కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు రెడీ అయ్యారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర- news10.app

ప్రజారోగ్యాన్ని అందించాల్సిన ఆరోగ్య విభాగానికి అవినీతి జబ్బు చేస్తే పేదవారి వైద్యం అందని ద్రాక్షే అవుతోంది. ప్రభుత్వం ఎన్ని కోట్లు కుమ్మరించినా.. ఎంత సంక్షేమం అమలు చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కొందరు అధికారుల భాగోతాలు ” అవినీతి రహిత పాలన ” అంటున్న ముఖ్యమంత్రికి ఇప్పుడు తలవంపులు తెస్తున్నాయన్న చర్చ అధికార పార్టీలో సాగుతోంది. కోట్ల మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ” కరోనా” విపత్కర సమయంలోనూ వైద్యఆరోగ్యశాఖలోని ఒక ఉన్నతాధికారికి కోట్లు కురుస్తున్నాయట.. అవినీతితో పంకిలమైన అధికారికి ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖ కల్పతరువుగా మారిందట..

వైద్య ఆరోగ్య శాఖలో తిష్టవేసిన సదురు ఉన్నతాధికారి అందులో జరిగిన నియామకాలు , ట్రాన్స్ ఫర్లు , ప్రమోషన్లలన్నింటిని ఒక్కోదానికి ఒక్కో రేటు పెడుతూ అందిని కాడికి దోచుకుంటున్నారని ఆ శాఖలోని ఉద్యోగులు వాపోతున్నారట.. ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి , అక్రమాలను పరాకాష్టకు చేరాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. వీటిపై ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో చిర్రెత్తుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా విజిలెన్స్ విచారణకి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఓ డీఎంఈ ఉన్నతాధికారి చేతివాటం, వ్యవహారశైలిపై అధికారులు విచారణ జరపగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయట..

సదురు డీఎంఈ అవినీతి వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది బాధిత వైద్యులు తమకు జరిగిన అన్యాయాన్ని విజిలెన్స్ విచారణ అధికారుల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల భారీ ఎత్తున జరిగిన నియామకాలలో.. ట్రాన్స్ ఫర్లలో.. ప్రమోషన్లలో, సదురు డీఎంఈ కోట్లు కొల్లగొట్టినట్లు విచారణలో బయటపడినట్లు సమాచారం. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు ఉన్నా కౌన్సెలింగ్ లో చూపక పోవడం.. వాటిని తరువాత డబ్బిచ్చిన వారికి కట్టబెట్టినట్టు విచారణలో తేలినట్టు తెలిసింది. అర్హత లేని వారికి ప్రోమోషన్లు ఇవ్వడం.. అర్హతలున్న వారికి మొండిచెయ్యి చూపడం.. బయో కెమిస్ట్రీ లాంటి డిపార్ట్మెంట్ లలో అర్హులైన వైద్యులను పక్కన బెట్టి , ఎంఎస్సీ లాంటి డిగ్రీ చేసిన వారిని 10 లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చినట్టు విజిలెన్స్ విచారణలో తేలినట్టు సమాచారం.

అవినీతి అక్రమాల కేసుల్లోనూ కొందరు వైద్య అధికారులను కాపాడినట్లు విచారణలో వెలుగుచూసిందట.. లంచాలు తీసుకొని ఆ కేసులను మాఫీ చేశాడట.. కర్నూల్ మెడికల్ కాలేజీలో ఒక ఫ్రొఫెసర్ (ఈయన టీడీపీ మాజీ మంత్రికి సమీప బంధువు ) కొద్ది సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాలేదు. దీన్ని కర్నూల్ కాలేజి అధికారుల నివేదికలు ధృవీకరించాయి. అయినా కూడా సదురు డీఎంఈ ఆయనకు మొత్తం జీతాన్ని మంజూరు చేసినట్టు వెలుగుచూసింది. ఇంత బరితెగింపుగా ఈ డీఎంఈ అవినీతికి పాల్పడడం పరాకాష్టకు నిదర్శనమని ఆ శాఖ ఉద్యోగులు బహిరంగంగానే విజిలెన్స్ ఎదుట గోడువెళ్లబోసుకున్నారట..

ఈ డీఎంఈ ఆఫీసులో చిన్న ఫైల్ కదలాలన్నా చెయ్యి తడపాల్సిందేనట.. బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని మరీ రాష్ట్రవ్యాప్తంగా కలెక్షన్లు చేసుకోవడం చూసి ఉన్నతాధికారులు ముక్కున వేలేసుకుంటున్నారట.. అసలు గుర్తింపే లేని ” ప్రభుత్వ వైద్యుల సంఘానికి ” కన్వీనర్ అవతారమెత్తిన ఒక దళారి వైద్యుడు ఈ బ్రోకర్ పనులలో సిద్ధహస్థుడుగా పేరు గాంచాడని వైద్యఆరోగ్యశాఖలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

మరో వైపు ఈ డీఎంఈ వ్యవహారశైలిపై ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రికి విషయం తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. డబ్బిస్తే తప్ప మంత్రి చెప్పినా పనులు కాకపోవడం చూసి ఆయన సీరియస్ అయినట్టు తెలిసింది. డీఎంఈ అవినీతి , అక్రమాలు , తలబిరుసుతనం, నిర్లక్ష్య వైఖరితోనే ఏపీ ప్రభుత్వం వరకు విషయం వెళ్లి సదురు డీఎంఈ అవినీతిని పెకిలించేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.

విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి అవినీతి జలగలను ఏరిపారేసేందుకు నిర్ణయించారు.చరిత్రలో ఎవ్వరూ చేయనన్ని వైద్య నియామకాలు చేపట్టిన ముఖ్యమంత్రికి ఈ అవకతవకలు అక్రమాల వల్ల అభాసుపాలు కావడం ఆగ్రహం తెప్పించిందని సమాచారం.. అందుకే విచారణాధికారులకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణాధికారులు కూడా రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా నిర్భయంగా వచ్చి సదురు డీఎంఈపై ఫిర్యాదు చేయాలని , వివరాలు గోప్యంగా ఉంచుతామని పిలుపినిచ్చారు. దీంతో సదురు డీఎంఈ డొంక కదులుతోంది.