దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం పూర్తి – ముఖ్యమంత్రి కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…

రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఎవరున్నా వెంటనే గుర్తించి చిట్ట చివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్దతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండటం శుభసూచకమన్నారు. ఇది భవిష్యత్తులో సాధించే గొప్ప విజయానికి నాంది అన్నారు.

సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఉత్పత్తి చేసే విత్తనాలను నిల్వ చేసేందుకు రూ. 25 కోట్లతో అతి పెద్ద అల్ట్రా మోడర్న్‌ కోల్డ్‌ స్టోరేజి నిర్మించనున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో రైతుబంధు సాయం విడుదల చేసినట్లు చెప్పారు. అధికారులు ఎంతో సమన్వయంతో వ్యవహరించి రైతులందరికీ సకాలంలో రైతుబంధు సాయం అందించినట్లు సీఎం పేర్కొన్నారు.