భయం…..భయం ఏజెన్సీలో అలజడి

చత్తీస్గడ్ ఎన్కౌంటర్ సంఘటన నేపథ్యంలో దేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం మొత్తంగా టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. 22 మంది పోలీసులను మావోయిస్టులు హతమార్చడంతో ఈ ప్రభావం చత్తీస్గడ్ రాష్ట్రం తో పాటు ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై పడింది. ఇది ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతం చత్తీస్గడ్ కావడంతో సరిహద్దులో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతం భయానక వాతావరణం నెలకొనివుంది…. ఎప్పుడు ఎంజారుగుతుందోనని ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోదావరిని ఆధారం చేసుకొని ఇవతలి ఒడ్డుకు మావోయిస్టులు తెలంగాణాలో కి చేరే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు ముందుగానే గోదావరి ఇవతలి ఒడ్డు ప్రాంతపు గ్రామాల్లో అంత అప్రమత్తం చేసినట్లు తెలిసింది… చత్తీస్ గడ్ ఎన్కౌంటర్ తర్వాత తెలంగాణ కు చేరుకున్న సి ఆర్ పి ఎఫ్ బలగాలు ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు.

భయం.....భయం ఏజెన్సీలో అలజడి- news10.app

ప్రతీకారం తప్పదా….?

వ్యూహత్మక దాడితో మావోయిస్టులు బీజాపూర్‌-సుక్మా సరిహద్దులో భద్రతా బలగాలపై మెరుపుదాడి చేసి 22 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జగ్దల్‌పూర్‌లో పర్యటించి అమరులకు నివాళులర్పించారు. కీకారణ్య బాసగూడ పోలీసు క్యాంపును సైతం సందర్శించి మావోయిస్టులపై ఇక యుద్ధం తప్పదన్న సంకేతాలు ఇచ్చారు.

పోలీసు భద్రతా బలగాలు కసితో రగిలిపోతున్న వేళ దండకారణ్యాన్ని జల్లెడ పట్టి మావోయిస్టులతో రణానికి ‘సై’ అంటున్నాయి. బస్తర్‌ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న భద్రాద్రితోపాటు ములుగు, భూపాలపల్లి జిల్లాలపై ప్రభావం పడే అవకాశాల నేపథ్యంలో ఆయా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌ దారులన్నీ పోలీసు గుప్పిట్లోకి వెళ్లబోతున్నాయి. ఇరు రాష్ట్రాల మావోయిస్టుల సంయుక్త దాడులను తిప్పికొట్టేందుకు పోలీసులు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. మరోపక్క ఈ నెల 26న దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు.

వార సంతలకు చెక్‌..!

బీజాపూర్‌ ఘటనతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న రహదారులను భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నాయి. ప్రధానంగా మావోయిస్టులకు ఆహార పంపిణీ వ్యవస్థ దెబ్బతీసేలా నిత్యావసర సామగ్రి వారి దరిచేరకుండా ప్రణాళికలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అటవీ గ్రామాల్లో జరిగే వారపు సంతలకు చెక్‌ పెట్టనున్నట్టు సమాచారం. బీజాపూర్‌, సుక్మా జిల్లాలోని యాంపురం, కొండపల్లి, భీమవరంపాడు, కిష్టారం, గొల్లపల్లి, ధర్మంపేట, బూరుగులంక తదితర కీకారణ్య గ్రామాల్లో ఇక వారపు సంతలను నిలిపేయాలని యోచిస్తున్నారు. సరిహద్దున సాగే పై వారసంతల్లో వ్యాపార కార్యకలాపాలను ఎక్కువగా భద్రాది, ములుగు జిల్లా వాసులే నిర్వహిస్తూ ఉంటారు. జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ సరిహద్దు పోలీసు స్టేషన్లల్లో భద్రతపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌కు మళ్లీ శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి.

ఆదివాసీ గ్రామాల్లో అలజడి..

గతంలో మావోయిస్టు యాక్షన్‌ టీం సభ్యులు గోదావరి దాటే క్రమంలో పినపాక మండలం ఏడూళ్లబయ్యారం పోలీసుల అప్రమత్తతతో వారంతా వెనుదిరిగారు. ఛత్తీస్‌గఢ్‌లో తాజా ఘటనకు సంబంధించి చెదురుమదురైన మావోలు తీరందాటి పినపాక, కరకగూడెం మండలాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. నూతన వ్యక్తుల వివరాల సేకరణ, విస్తృత వాహన తనిఖీలు చేపడుతున్నారు. దీంతో పినపాక, కరకగూడెం మండలాల్లో ఉన్న సుమారు 15 వలస ఆదివాసీ గ్రామాల్లో అలజడి మొదలైంది. ప్రస్తుతం వీరంతా ప్రతినెలా స్థానిక ఠాణాలో సంతకాలు చేసి రావాల్సి ఉంటుంది. కొత్త వ్యక్తులు వస్తే తప్పనిసరిగా సమాచారం అందించాలి. వివరాలను ఠాణాలో నమోదు చేయించాలి. ఈ క్రమంలో గ్రామాల్లో అలజడి వాతావరణం కనిపిస్తోంది.

పోలీసుల కార్డెన్ సెర్చ్…

ములుగు జిల్లాఏటూరునాగారంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 200 మంది సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ బలగాలతో ప్రతీ ఇంట్లోనూ సోదాలు చేశారు. అనుమానితులను రానివ్వద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సోదాలు చేపట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) పోలీసులు కూడా ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఎస్సై తిరుపతి నేతృత్వంలో మండలంలోని బర్లగూడెం గ్రామ సమీపంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ట్రెయినీ ఎస్సై ప్రసన్నకుమార్‌, సిబ్బందితో కలిసి వాహనాలను, ఆర్టీ బస్సులను ఆపి సోదా చేశారు. అనుమానిత వ్యక్తుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించారు. తాడ్వాయి మండలం జలగలంచ గొత్తికోయగూడెంలో ఎస్సై వెంకటేశ్వర్‌రావు నేతృత్వంలో కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. గూడెంలోని ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా సోదా చేశారు. గూడెంలోకి కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. అదేవిధంగా మండలకేంద్రంలోని కాటాపూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.

మొత్తానికి చత్తీస్ ఘడ్ ఘటన తర్వాత మావోయిస్టులపోలీసులపై వ్యూహాత్మక దాడి చేయడంలో కీలక పాత్ర పోషించిన హిద్మా ను పట్టుకునేందుకు పోలీసు బలగాలు తమదైన వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలిసింది… ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత హిద్మా ఓ పోలీస్ అధికారి పోన్ చేసి సవాల్ విసిరాడనే వార్త చక్కర్లు కొడుతుండగా ఈ ఫోన్ కాల్ ఎక్కడినుంచి వచ్చింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది… హోమ్ మంత్రి అమిత్ షా పర్యటన తర్వాత పోలీసు బలగాలు పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది… మావోయిస్టులను నిలువరించేందుకు ముఖ్య నేతలను అదువులోకి తీసుకొనేందుకు అందివచ్చిన అవకాశాలను అన్నింటినీ పోలీసులు ఉపయోగించుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి అటు మావోయిస్టులు ఇటు పోలీసులు ఎప్పుడు ఎంజరుగుతుందోనని ఏజెన్సీ వాసులు భయం భయం గా గడుపుతున్నారు.