రాకోయి….అనుకోని అతిథి!

నియోజకవర్గాల్లో పర్యటించాలంటే ఎంపీ లకు తిప్పలే…
తమకు చెప్పకుండా రావద్దని ఎమ్మెల్యే ల ఆదేశాలు
ఎమ్మెల్యేలకు ఇష్టం లేదంటే అంతేసంగతులు ఎంపీ ల పర్యటనలు వాయిదే…
సాయం చేయాలన్న, సమావేశం పెట్టాలన్న, కార్యకర్తలతో మాట్లాడాలన్న ఎమ్మెల్యే ల అనుమతి తప్పనిసరి
ఏ కార్యక్రమం చేసినా ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాల్సిందే, ఆహ్వానించాల్సిందే
నియోజకవర్గాల్లో అనధికార షరతులతో పర్యటనలే మానుకుంటున్న ఎంపి లు

రాష్ట్రంలో ఎంపీలు ప్రస్తుతం వారి నియోజక వర్గాల్లో వారే కొత్త వారీగా మారారు. ఎన్నికల అప్పుడు కనపడ్డ ఎంపీలు మళ్ళీ ఓటర్లకు ఇప్పటి వరకు కనపడలేదు. అడపా దడపా ఎదో అసెంబ్లీ నియజకవర్గంలో సమావేశం జరిగితే ‘నలుగురిలో నారాయణ’ అన్నట్లు మంత్రులతోనో, ఎమ్మెల్యే ల తోనో కనిపించారు తప్ప పాపం వారు ఇప్పటివరకు సింగిల్ గా ఎవరికి కనిపించలేదట. ఎదో అభిమానం ఉన్న కార్యకర్తలు, నాయకులు పనిపై ఎంపీల ఇండ్లకు వెళితే మాత్రమే కనిపిస్తారట. ఇలా కార్యకర్తలు, నాయకులు వెళ్లి ఎంపీలకు సింగిల్ గా కనపడిన ఏ నియోజకవర్గంమో తెలుసుకొని కొంతమంది నాయకులు అక్కడికి ఎందుకువెళ్ళావు, ఎమ్మెల్యే ఉండగా అక్కడేం పని అని ఆరా తీస్తున్నారట.. ఇది సంగతి ప్రస్తుతం తెలంగాణ లోని ఎంపిలు అంతా “అడకత్తెరలో పోక చెక్కలా” నలిగి పోతున్నారట. నియోజకవర్గాల్లో పర్యటించక తలలు పట్టు కుంటున్నారట, జనం తమ ఎంపీ కనపడడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మాకు తిరగాలని ఉన్న పరిస్థితులు సహకరించడం లేదని వాపోతున్నారు.

రాకోయి....అనుకోని అతిథి!- news10.app

ఏంటా పరిస్థితులు…?

రాష్ట్రంలోని ఎంపీ స్థానాలన్ని ఎన్నో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడి ఉన్నాయి. అసెంబ్లీ నియోజక వర్గాలు కల్సి పార్లమెంటరీ స్థానం ఏర్పడుతుంది. ఐయితే ఈ పార్లమెంట్ స్థానాల్లో రెండు, మూడు కు మించి అసెంబ్లీ స్థానాలు కలిసిన పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పర్యటించాలంటే ఎంపీలకు పెద్ద సవాల్ గా మారిందట. నిజకవర్గం లోని ఎమ్మెల్యే అనుమతి లేకుండా పర్యటించేది లేదు. అలా పర్యటించార… అంతేసంగతులు ఎంపీ గ్రూప్ రాజకీయాలు స్థానిక ఎమ్మెల్యే కు చెప్పకుండా వస్తున్నాడని అధిష్టానానికి పిర్యాదు వెళ్తుంది. వేరే పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలు ఉంటే మాత్రం ఇది ప్రత్యేక్ష గొడవకు దారి టిస్తుందట. అంతేకాదు ఎంపీ ఏ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అనుమతితో పాటు వారిని సైతం ఆ కార్యక్రమానికి పిలువాలట. ఎమ్మెల్యే కు తీరికలేకుంటే. .కార్యక్రమము రద్దు చేసుకోవాలట. దీంతో ఇదంతా చేసి టెన్షన్ పడే కన్నా కార్యక్రమము నిర్వహించకుండా, నియోజకవర్గం పర్యటించకుండా ఉంటే మంచిదని కొందరు ఎంపీలు తమ కార్యక్రమాలనే రద్దుచేసుకుంటున్నారట.

అందుకే కనపడరట…

పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ల అనుమతి తప్పనిసరి కావడంతో ఎంపీలు పర్యటించకుండా ఉంటున్నారట. ఇటివల వరంగల్ ఉమ్మడి జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో తనకు చెప్పకుండా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారని, గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. నియోజకవర్గంలో తానే సుప్రీం అని తన అనుమతిలేకుండా మంత్రి, ఎమ్మెల్సీ ఎవరైనా రాకూడదని వార్నింగ్ ఇచ్చారు. అంటే నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ సంఘటన అద్ధం పడుతుంది. కొందరు బయట పడుతుంటే కొందరు పడడం లేదు కోల్డ్ వార్ మాత్రం కొనసాగుతుందనేది మాత్రం స్పష్టం.

అభివృద్ధి మాటేంటి…?

పార్లమెంట్ నియజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పెడుతున్న ఆంక్షలతో అభివృద్ధి సైతం కుంటు పడుతున్నట్లు తెలుస్తుంది. ఎంపీ నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోతున్నాయి అనే ఆరోపణ సైతం ఉంది. సకాలంలో నిధులను వాడకపోవడం మూలంగా వాపస్ వెళ్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీల సమన్వయ లోపం వల్ల అభివృద్ధి నిలిచిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎంపీ అభివృద్ధి పేరుతో పనులు నిర్వహిస్తే నియోజకవర్గంలో తమ పరిస్థితి ఏంటని కొందరు ఎమ్మెల్యేలు పనులకు అడ్డు పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంకొందరైతే పనులు మాకే అప్పగించాలని ఎంపిలను డిమాండ్ చేస్తూ ససేమిరా … అంటే పనులు జరగకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. పనులన్నీ ఎమ్మెల్యేలకు అప్పగిస్తే తమ అనుచరులు ఎం కావాలని కొందరు ఎంపీలు అడుగుతున్న ఎమ్మెల్యే లు మాత్రం దారికి రావడం లేదని తెలుస్తోంది. మొత్తానికి ఇన్ని ఆంక్షల మూలంగా తాము నియోజకవర్గాల్లో పర్యటించలేక పోతున్నామనేది ఎపిల వాదన.