రైతుల డబ్బులు మింగిందెవరు….?

శాయంపేట మండలంలో అధికారులు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు…ఒక్కో రైతుకు చెందినవేల రూపాయల ధాన్యం డబ్బులు కోత విధించబడి రైతుకు రాకున్నా కనీసం అలా ఎందుకుజరిగిందో చెప్పే జవాబుదారీతనం కూడా ఇక్కడ లేకుండా పోయింది… పోయిన డబ్బులు పోయాయి మాకెమిపట్టిందనే ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వేల రూపాయలు కోత విదించబడ్డాయని నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన ఈ మండలంలో కనీసం పట్టించుకునే అధికారి కరువయ్యాడు… మిల్లర్లు తరుగు తీశారు, ఎండకు ఎండి ధాన్యం పరిమాణం తగ్గిపోయింది, డబ్బులు రావు మలుసుకొని పండండి, అది మా పరిధిలో లేదు వంటి వింత సమాదానాలతో ఐకేపి అధికారులు అన్నదాతలపై అసహనం ప్రదర్శిస్తుంటే పట్టించుకోవాల్సిన అధికారులు పెదవిమాత్రం విప్పడం లేదు.

రైతుల డబ్బులు మింగిందెవరు....?- news10.app

మండల వ్యాప్తంగా ఒక్కో రైతునుంచి 4 వేల నుంచి 20 వేలకు పైగా లక్షలాది డబ్బులు ఎక్కడకు వెళ్లాయి… ఎవరు మింగారో తెలియకున్న అధికారులు తమ మొద్దునిద్ర విడడం లేదు…అసలు ఇలా ఎందుకు జరిగింది లక్షలాది డబ్బులు ఎవరి ఖాతాలో అక్రమంగా జమ ఐయ్యాయో చెప్పాల్సిన అధికారులు ఇప్పటికి ఈ విషయం పై కనీస ప్రాథమిక విచారణ కూడా చేపట్టక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది…. కనీసం ప్రజాప్రతినిధులు సైతం ఇంత జరుగుతున్నా రైతులకు కనీసం సహకరించకుండా మౌనం పాటిస్తున్నారు. కాగా శాయంపేట మండల వ్యాప్తంగా ఈ సీజన్లో 12 వందల మంది రైతులు 57 వేల 972 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించారు.ఒక లక్ష 44 వేల 939 ధాన్యం బస్తాలు ఐకేపి ద్వారా సేకరించబడ్డాయి.సాదు కుమారస్వామి అనే రైతు 147 బస్తాల ధాన్యాన్ని ఐకేపి కి విక్రయించగా ఇతనికి లక్ష 12 వేల రూపాయలు రావాలి కానీ ఈ రైతు ఖాతాలో 92 వేల రూపాయలు మాత్రమే జమ ఐయ్యాయి . 19 వేల 500 రూపాయలు ఎక్కడికి వెళ్ళాయో ఎవరు మింగారో ఇప్పటికి సమాధానం లేదు. మరో రైతు సింగారపు సాంబయ్య 104 బస్తాల ధాన్యం విక్రయించగా 78 వేల 540 రూపాయలు రావాలి కానీ 70 వేల 233 రూపాయలు ఖాతాలో పడ్డాయి 8వేల 307 రూపాయలు కోత విధించబడ్డాయి. ఇలా మండల వ్యాప్తంగా ఐకేపి కొనుగోలు చేసిన కేంద్రాలు శాయంపేట, పత్తిపాక, పెద్దకోడెపాక, కాట్రపల్లి కేంద్రాల్లో రైతులు విక్రయించినదానికి ఖాతాలో పడ్డ డబ్బులకు అసలు సంబంధం లేకుండా పోయిందని తెలిసింది. అయితే ఈ కోత విధించబడ్డ డబ్బులు బినామీ పేర్లతో ఎవరి ఖాతాల్లో పడ్డాయో అధికారులు స్పష్టం చేయాలని రైతులు అంటున్నారు.

సర్కార్ దగ్గరనుంచి రావాల్సిన డబ్బులు ఖచ్చితంగానే వచ్చిన ఎక్కడ పక్కదారి పడ్డాయో అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. వింత సమాదానాలతో తమకేం సంబంధం లేనట్లు వ్యవహరించే ఐకేపి అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. న్యూస్10 లో ధాన్యం డబ్బుల్లో కోత వార్త కథనం వెలువడిన తర్వాత ఐకేపి కి చెందిన ఓ ఉద్యోగి కోత విధించబడ్డ డబ్బుల్లో సగం చెల్లిస్తామని ఓ ప్రజాప్రతినిదికి చెప్పడం ఈ డబ్బుల కోత తిలా పాపం తలా పిడికెడు చందంగా ఉన్నట్లు అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. ఈ అనుమానాలకు పులిస్టాప్ పెట్టాలంటే అధికారులు ఇప్పటికైనా ధాన్యం డబ్బుల కోత ఎందుకు జరిగిందో విచారణ చేపట్టి రైతుల డబ్బులు రైతులకు అందేలా చేస్తారా…లేక తమ ఉలుకు పలుకు లేని మౌనాన్ని అలాగే కొనసాగిస్తార… వేచిచూడాలి.