ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ కోత…

లీటరుకు రూ.10 తగ్గింపు ప్రకటించిన కేంద్రం

ప్రజలను ధరల భారం నుంచి కాపాడేందుకే నిర్ణయం: నిర్మలా సీతారామన్

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.1 లక్ష కోట్ల మేర ఆదాయ నష్టం వాటిల్లనున్నప్పటికీ, ప్రజలను పెరుగుతున్న ధరల భారం నుంచి రక్షించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో కూడా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీంతో రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో రవాణా రంగానికి కొంత ఊరట లభించడంతో పాటు, ద్రవ్యోల్బణం నియంత్రణకు కూడా సహాయపడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఇంధన ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here