మహబూబాబాద్ జిల్లాలో ఇసుక ర్యాంప్ డీల్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని చిన్న గూడూరు మండల పరిధిలో ఇసుక ర్యాంప్ ఒప్పందం విషయంలో ఎస్సై ప్రవీణ్ రెడ్డి జోక్యం చేసుకుని రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
చిన్న గూడూరు మండలానికి చెందిన ఆంగోత్ బాలకృష్ణ ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ర్యాంప్ ను పోలీసులు సీజ్ చేసిన క్రమంలో ఎలాంటి కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు స్థానిక ఎస్సై ప్రవీణ్ రెడ్డి రూ.1 లక్ష ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మొదటగా రూ.20 వేలును ఫోన్ పే ద్వారా చెల్లించామని, మిగిలిన రూ.80 వేలును మూడు రోజుల్లో చెల్లిస్తామని ఫోన్ పే లో ఓ సందేశాన్ని పంపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోన్ పే లావాదేవీల స్క్రీన్ షాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వ్యవహారం పై వాస్తవాలను బయట పెట్టేందుకు ఆంగోత్ బాలకృష్ణ తన భార్యతో కలిసి మీడియా ముందుకు వెళ్లేందుకు సిద్దమవుతున్న క్రమంలో సమాచారం అందుకున్న పోలీస్‌లు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు
బాలకృష్ణ దంపతులను అరెస్ట్ చేయడంపై వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “వాస్తవాలు చెప్పడం నేరమా? లంచం డిమాండ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, విషయం బయటపెట్టిన వారినే అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
బాలకృష్ణ దంపతులను వెంటనే విడుదల చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నిజానిజాలు వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై అధికారికంగా పోలీస్ శాఖ నుంచి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. విచారణ అనంతరం అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
ఇక ఇదే అంశంపై స్థానిక ఎస్సై ప్రవీణ్ రెడ్డి తో న్యూస్ 10 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాట్లాడారు.
ఉద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నం చేశారు..
ఇసుక ర్యాంపు విషయంలో డబ్బులు డిమాండ్ చేసాము అనేది పూర్తిగా అవాస్తావం.నా ప్రమేయం లేకుండా నా ఫోన్ పే కు డబ్బులు పంపగానే వెంటనే ఇదే విషయాన్ని నా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లా.
ఇందులో నన్ను ఇరికించేందుకు నాపై అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.ఉన్నత అధికారుల విచారణలో పూర్తి విషయాలు బయటపడుతాయనే నమ్మకం నాకుంది..
ప్రవీణ్ రెడ్డి
ఎస్సై చిన్న గూడూర్ .మహబూబాబాద్ జిల్లా



